సెల్యూట్: గుహలో చిక్కుకున్న కుటుంబాన్ని రక్షించిన అటవీశాఖ అధికారులు

సెల్యూట్: గుహలో చిక్కుకున్న కుటుంబాన్ని రక్షించిన అటవీశాఖ అధికారులు

వయనాడ్ లో ప్రకృతి సృష్టించిన బీభత్సానికి భారీగా మరణాలు సంభవించాయి. ఈ విపత్తులో మృతుల సంఖ్య ఇప్పటికే 340కి చేరుకుంది. వరదల్లో, నివాసాల్లో, కొండ ప్రాంతాల్లో చిక్కుకున్న శరణార్థుల కోసం సహాయక చర్యలు ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. ఈ విపత్తులో  దాదాపు 200 మంది అదృశ్యమయ్యారని అధికారులు తెలిపారు.  సహాయక చర్యల్లో భాగంగా శుక్రవారం వరకు 210 మృతదేహాలు, 134 శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. మృతుల్లో 96 మంది పురుషులు, 85 మంది మహిళలు, 29 మంది చిన్నారులు ఉన్నట్లు పేర్కొన్నారు. 

తాజాగా కొండ ప్రాంతంలో చిక్కుకున్న కుటుంబాన్ని క్షేమంగా ఒడ్డుకు చేర్చడానికి అటవీ అధికారులు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ వీడియో వైరల్ గా మారింది. గురువారం కల్పేట రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ కె.హాషిస్ నేతృత్వంలోని బృందం అడవిలో చిక్కుకున్న ఒక గిరిజన కుటుంబాన్ని రక్షించడానికి ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లి అత్యంత సాహసోపేతంగా వారిని ఒడ్డుకు చేర్చారు.  పనియా కమ్యూనిటీకి చెందిన కుటుంబం లోతైన లోయకు ఎదురుగా ఉన్న కొండపై ఉన్న గుహలో చిక్కుకుపోయింది. వారిని చేరుకోవడానికి రెస్క్యూ టీమ్ నాలుగున్నర గంటలపాటు కఠోరంగా శ్రమించి వారిని ఒడ్డుకు చేర్చారు. 

ఈ ఘటనపై అధికారులు స్పందించారు. ఓ ఆదివాసి మహిళ తన భర్తతో పాటు ముగ్గురు పిల్లలు గుహలో చిక్కుకున్నారని రెస్క్యూ టీంను సంప్రదించిందన్నారు. విషయం తెలిసిన వెంటనే  రెస్క్యూ టీం రంగంలోకి దిగి వారిని కనుగొన్నామన్నారు. వారి వద్దకు వెళ్లి చూడగా ఐదు రోజులుగా ఆహారం లేక వారంతా అలసిపోయారని తెలిపారు. ఈ క్రమంలో మా వద్ద ఉన్న ఆహారాన్ని వారికి ఇచ్చామని పేర్కొన్నారు. అనంతరం వారిని ఒడ్డుకు చేర్చుతామంటే వారంతా సంశయించారని.. నిదానంగా వారికి అన్నీ వివరించిన తర్వాత బయటకు రావడానికి ఒప్పుకున్నారని అధికారులు తెలిపారు. 

Also Read :- ప్రీతి వీడియోలు బయటపెట్టిన లావణ్య

రెస్క్యూ టీంను ప్రశంసించిన కేరళ సీఎం
సహాయక బృందాలు ప్రాణాలకు తెగించి ఈ కుటుంబాన్ని కాపాడిన ఘటనపై సీఎం విజయన్ అభినందించారు.  అటవీశాఖ అధికారుల కృషిని విజయన్ సోషల్ మీడియాలో కొనియాడారు. కొండచరియలు విరిగిపడిన వయనాడ్‌లో సాహసోపేతంగా అటవీ అధికారులు 8 గంటలపాటు శ్రమించి గిరిజన కుటుంబాన్ని కాపాడారని తెలిపారు. కష్టకాలంలో కేరళలోని వివిధ వర్గాలు, సంఘాలు బాధితులకు తో డుగా నిలబడుతున్నాయని.. భారీ ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా సహాయక చర్యలకు పూనుకుంటున్నారని తెలిపారు. వరదల నుంచి కోలుకొని రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.