
రోడ్డు మీద స్పీడ్‌గా పోతోందో లారీ.. ఆ లారీ నిండుగా గడ్డి లోడ్.. అంతలో పైనున్న కరెంట్ వైర్ తాకి గడ్డి అంటుకుంది. లారీ కూడా మంటల్లో చిక్కుకుంది. వెంటనే డ్రైవర్ కిందకి దూకేసి పరుగు తీశాడు. రోడ్డుపైన లారీ. పక్కనే మరెన్నో వెహికల్స్, . ఏమవుతుందోనని జనం కంగారు పడుతున్నారు. ఇంతలో వచ్చాడో హీరో.. లారీ ఎక్కి డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు. లారీ ని దగ్గర్లో ఉన్న గ్రౌండ్‌వైపు మళ్లించాడు. గ్రౌండ్ కెళ్లాక అక్కడ, లారీని జిగ్‌జాగ్‌గా తిప్పాడు. కాలుతున్న గడ్డి కింద పడిపోవడం మొదలైంది. పెద్ద ప్రమాదం తప్పింది. ఇది జరిగింది కేరళలోని కోడెంచెరి టౌన్లో. ఆ రియల్ హీరో పేరు షాజీ వర్గీస్. 45 ఏళ్ల వర్గీస్ ఈ సాహసం చేసుండక పోతే ఏమైవుండేదో ఊహించడానికే భయమేసిందని అక్కడివాళ్లు అన్నారు. ఈ లోపు ఫైర్ డిపార్ట్‌మెంట్‌వాళ్లు వచ్చి మంటలు ఆర్పేశారు. వర్గీస్ లారీని అలా గ్రౌండ్లోకి తీసుకెళ్లక పోతే లారీ డీజిల్ ట్యాంకుకు మంటలు అంటుకొని వాహనం పేలేదని, చుట్టు పక్కల ప్రజలకు, ఆస్తికి పెద్ద ఎత్తున నష్టం జరిగి ఉండేదని ఆఫీసర్లు తెలిపారు. వర్గీస్ సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని అందరు మెచ్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్అయింది. వర్గీస్‌కు ఇప్పుడు సినిమా హీరో అంత క్రేజ్ వచ్చేసింది.