డీప్​ఫేక్​ టెక్నాలజీలతో దోచేస్తున్నరు

డీప్​ఫేక్​ టెక్నాలజీలతో దోచేస్తున్నరు

న్యూఢిల్లీ: సైబర్​ నేరగాళ్లు ఏఐ/డీప్​ఫేక్ టెక్నాలజీ సాయంతో జనాన్ని నిలువునా ముంచుతున్నారు. బంధువులమనో, స్నేహితులమనో ఫోన్​ చేసి డబ్బు కొట్టేస్తున్నారు. ఈ టెక్నాలజీ ప్రత్యేకత ఏమిటంటే నేరగాళ్లు తమ ముఖాన్ని వేరేవాళ్ల ముఖంలా మార్చి వీడియో కాల్​ చేయవచ్చు. ఇలాగే ఇతరుల గొంతుతో ఆడియోలూ తయారు చేయవచ్చు.  కేరళ నగరం కోజికోడ్ నివాసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) స్కామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గురై రూ. 40 వేలు కోల్పోయాడు. రాధాకృష్ణన్‌‌‌‌‌‌‌‌కి తెలియని నంబర్ నుంచి వాట్సాప్‌‌‌‌‌‌‌‌లో వీడియో కాల్ వచ్చింది. అందులో ఉన్నది ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఆయన మాజీ కొలీగ్​లా కనిపించారు.

తన బంధువు ఆసుపత్రిలో ఉన్నాడని,  ఆర్థిక సహాయం చేయాలని రిక్వెస్ట్​ చేశారు. తొలుత రాధాకృష్ణన్‌‌‌‌‌‌‌‌ రూ.40 వేలు పంపించగా, అదే వ్యక్తి అదనంగా రూ. 30వేలు  డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేయడంతో అనుమానాలు తలెత్తాయి. ఏదో తప్పు జరిగిందని గ్రహించిన బాధితుడు వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫేక్ వీడియోలను రూపొందించడానికి ఏఐ టెక్నాలజీలను ఉపయోగించడం కేరళలో ఇదే మొదటిసారి. డీప్‌‌‌‌‌‌‌‌ఫేక్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీ సాయంతో ముఖాలను, గొంతులను మార్చి మోసాలు చేస్తున్నారు. ముఖ్యంగా, 2017లో సెలబ్రిటీల ముఖాలతో బ్లూఫిల్మ్​లను తయారు చేయడంతో డీప్‌‌‌‌‌‌‌‌ఫేక్‌‌‌‌‌‌‌‌లు అందరి దృష్టిని ఆకర్షించాయి.  తప్పుదారి పట్టించే వీడియోలను సృష్టించడానికి, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి,  ఆర్థిక మోసాలకు పాల్పడేందుకు ఈ టెక్నాలజీలను దుర్వినియోగం చేస్తున్నారు.

ఈ వాట్సాప్  డీప్‌‌‌‌‌‌‌‌ఫేక్ స్కామ్  కేసులో, పోలీసులు దర్యాప్తు చేయగా బాధితుడు పంపిన డబ్బు మహారాష్ట్రలోని ఒక ప్రైవేట్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ ఖాతాకు వెళ్లినట్టు గుర్తించారు. సంబంధిత ఖాతాను అధికారులు స్తంభింపజేశారు. సోషల్ మీడియా నుంచి సేకరించిన బాధితుడి స్నేహితులు,  పరిచయస్తుల చిత్రాలను ఉపయోగించి నేరస్తులు కాల్​ చేశారు. చైనాలో ఒక మోసగాడు ఏఐ- పవర్డ్ ఫేస్- స్వాపింగ్ టెక్నాలజీని వీడియో కాల్ సమయంలో ఉపయోగించి భారీ మోసం చేశాడు. బాధితుడి నుంచి  622,000 డాలర్లను కాజేశాడు. ఏఐ -ఆధారిత డీప్‌‌‌‌‌‌‌‌ఫేక్ మోసం నుంచి రక్షించుకోవడానికి అప్రమత్తంగా ఉండాలి. 

కింద ఇచ్చిన గైడ్​లైన్స్​ను పాటించాలి. 

1. వాట్సాప్​ లేదా సోషల్ మీడియా ద్వారా మిమ్మల్ని సంప్రదించే వ్యక్తులు అసలైన వారా? నేరగాళ్లా ? అనేది నిర్ధారించుకోవాలి.
2. గుర్తుతెలియని వ్యక్తులకు ఆర్థిక సమాచారాన్ని ఇవ్వకూడదు. పూర్తి వివరాలు తెలియకుండా ఎవరికీ డబ్బు బదిలీ చేయకండి.
3. ఆర్థిక, వ్యక్తిగత సమాచారాన్ని కోరుతున్న కాలర్లకు బ్యాంక్ ఖాతా లేదా క్రెడిట్ కార్డ్ వివరాలను ఎప్పుడూ వెల్లడించవద్దు.
4. కాల్ అనుమానాస్పదంగా కనిపిస్తే లేదా డీప్‌‌‌‌‌‌‌‌ఫేక్‌‌‌‌‌‌‌‌ అనిపిస్తే, ఫోన్​ కట్​ చేసి నంబర్​ను బ్లాక్​ చేయండి. 
5. ఏదైనా ఆర్థిక లావాదేవీలు చేయడానికి ముందు, వేరొక నంబర్ లేదా వేరే కమ్యూనికేషన్ యాప్​ వాడి మనకు కాల్​ చేసింది అసలు వ్యక్తేనని రూఢీ చేసుకోండి.
6. లావాదేవీని ఆపేయడానికి, ఏదైనా మోసపూరిత సంఘటనలను తెలియజేయడానికి వెంటనే పోలీసు హెల్ప్‌‌‌‌‌‌‌‌లైన్ (1930)కి ఫోన్​ చేయాలి.

డీప్‌‌‌‌‌‌‌‌ఫేక్‌‌‌‌‌‌‌‌ను గుర్తించడం సవాలే కానీ ఈ కింది జాగ్రత్తలు సహాయపడతాయి:

  • ముఖంలో అసహజమైన మార్పులు ఉంటే అది డీప్​ఫేక్​ ముఖం కావొచ్చు. ఇలాంటి ముఖాల నుదురు, బుగ్గలు సహజంగా కనిపించవు. 
  • ముఖం మీది చర్మం ఎక్కువ మృదువుగా ఉన్నా లేదా ఎక్కువ ముడతలు ఉన్నా అనుమానించాల్సిందే! 
  • ప్రత్యేకించి కళ్ల కింద నీడలను గమనించండి. ఇవి సరిగ్గా లేకుంటే మోసపూరిత కాల్​ అని అర్థం.
  • ముఖం మరీ మెరిసినట్టు ఉన్నా, అసహజంగా ఉన్నా అది డీప్‌‌‌‌‌‌‌‌ఫేక్‌‌‌‌‌‌‌‌ ముఖం అయి ఉండొచ్చు.
  • డీప్‌‌‌‌‌‌‌‌ఫేక్‌‌‌‌‌‌‌‌ కాల్​ చేసే వ్యక్తి పెదవి కదలికలు సక్రమంగా ఉండవు కాబట్టి వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తే అసలు విషయం అర్థమవుతుంది. 
  • తగిన జాగ్రత్తలు తీసుకోవడం, అధికారులకు సమాచారం ఇవ్వడం ద్వారా ఏఐ ఆధారిత డీప్‌‌‌‌‌‌‌‌ఫేక్ స్కామ్‌‌‌‌‌‌‌‌ల నుంచి రక్షించుకోవచ్చు.