అయ్యప్ప దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు.. ఒక్కరోజే లక్షల్లో బుకింగ్స్

అయ్యప్ప దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు.. ఒక్కరోజే లక్షల్లో బుకింగ్స్

అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల ఆలయం అయ్యప్ప నామస్మరణతో మారు మోగుతోంది. ఆలయానికి వస్తోన్న లక్షల మంది భక్తులతో పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. ఒక్కరోజే లక్ష మందికి పైగా భక్తులు తరలిరావడంతో దర్శనానికి రికార్డుస్థాయిలో బుకింగ్‌లు వచ్చాయి. ఆలయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం  ఒక్క రోజే 1,07,260 మంది భక్తులు దర్శన సమయాలను బుక్ చేసుకున్నారని చెప్పారు. విపరీతమైన భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ఇప్పటికే విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

పంపా నుంచి సన్నిధానానికి విచ్చేసే భక్తులను తాము నియంత్రిస్తున్నామని, దీని కోసం ప్రతీ పాయింట్ వద్ద పోలీసు అధికారులు ఉంటారని శబరిమల ప్రత్యేక అధికారి హరిశ్చంద్ర నాయక్ తెలిపారు. భక్తుల రద్దీ కారణంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. క్యూలో తేలికపాటి ఆహారం, తాగునీరు అందిస్తున్నామన్నారు. ట్రాఫిక్‌ను నియంత్రించడానికి పోలీసులతో పాటు, RAF, NDRF సిబ్బంది సేవలను కూడా వినియోగించుకుంటామని తెలిపారు. 

శబరిమల దర్శనం కోసం డిసెంబర్ 13న 77,216 మంది, డిసెంబర్ 14న 64,617 మంది ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నారు. శనివారం సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 60,000 మంది శబరిమలను సందర్శించారు. అంతకుముందు నవంబర్ 24న అయ్యప్ప తీర్థయాత్రకు మొదటి ఆరు రోజుల్లో 2.5 లక్షల మంది యాత్రికులు అయ్యప్ప ఆలయాన్ని సందర్శించారని కేరళ దేవాదాయ శాఖ మంత్రి కె.రాధాకృష్ణన్ తెలిపారు. రానున్న రోజుల్లో భక్తుల సంఖ్య పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పారు.