
మనం ఏదైనా మంచి పని చేసినప్పుడు ఇంట్లో వాళ్ళో, ఊళ్ళో వాళ్ళో, ఫ్రెండ్సో మెచ్చుకోవడం మామూలే. ఇంకా గొప్ప పని అయితే ఫ్లెక్సీలు కూడా వేస్తారు. అయితే, మనల్ని మనమే మెచ్చుకుంటూ ఫ్లెక్సీ వేసుకుంటే ఎలా ఉంటుంది? విచిత్రంగా అనిపిస్తోందా? కేరళలో ఓ కుర్రాడు ఇలాగే చేశాడు. తనని తాను అభినందించుకుంటూ ఫ్లెక్సీ వేసుకున్నాడు. అదీ దేనికోసమో తెలుసా? పదో తరగతి పాసైనందుకు! అంటే స్టేట్ ఫస్టో, డిస్ట్రిక్ట్ ఫస్టో వచ్చాడనుకునేరు. కేవలం పాసయ్యాడు అంతే. అయినా సరే తన ఘనతకు తానే మురిసిపోతూ ఫ్లెక్సీ వేసుకున్నాడు. ఆ కుర్రాడి పేరు జిష్ణు అలియాస్ కుంజక్కు. కేరళలోని పతనంతిట్టలో ఉంటాడు. కేరళలో ఈమధ్య టెన్త్ రిజల్ట్స్ వచ్చాయి. అందులో పాసయ్యాడు జిష్ణు. అంతే, నల్లటి కళ్ళద్దాలు పెట్టుకొని ఫొటో దిగి ఫ్లెక్సీ వేయించుకున్నాడు. ఫ్లెక్సీలో తన ఫొటో పైన ‘హిస్టరీ మేక్స్ వే ఫర్ సమ్ పీపుల్’(కొంతమంది కోసం చరిత్ర దారి ఇస్తుంది) అంటూ రాసుకున్నాడు.ఫ్లెక్సీ కింది భాగంలో ‘2022 ఎస్ఎస్ఎల్సీ ఎగ్జామ్స్ పాసైనందుకు నన్ను నేను అభినందించుకుంటున్నాను. కథ ఇప్పుడే మొదలైంది. కుంజక్కు వెర్షన్ 3.ఓ’ అంటూ కూడా రాసుకొచ్చాడు. ఈ ఫ్లెక్సీ విషయం కేరళ విద్యాశాఖ మంత్రి వి.శివన్‌కుట్టికి చేరింది. కుంజక్కు స్పిరిట్‌ను అభినందిస్తూ, మరిన్ని పరీక్షల్లో పాసవ్వాలని కోరుకుంటూ ట్వీట్ చేశాడు ఆయన. ‘ఎస్ఎస్ఎల్సీలో ఏ–గ్రేడ్‌లో పాసైనవాళ్ళ ఫొటోలు ఫ్లెక్సీల్లో ఉండడం చూశా. నేను కూడా ఫ్లెక్సీ వేసుకోవాలనుకున్నా. అందుకు ఫ్రెండ్స్ కూడా సాయం చేశారు. ఇంటర్ పాసైతే మళ్ళీ ఇలాగే ఫ్లెక్సీ వేసుకుంటా’అన్నాడు జిష్ణు. కాగా, జిష్ణు తల్లిదండ్రులు రోజువారీ కూలీలు. వీళ్ళ ఇంటికి కరెంటు సౌకర్యం కూడా ఎగ్జామ్స్ రిజల్ట్స్‌కు వారం ముందు వచ్చింది. కిరోసిన్ లాంతరు వెలుగులో పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు జిష్ణు.