ఇజ్రాయెల్ పోలీసులకు  కేరళ నుంచి యూనిఫామ్

ఇజ్రాయెల్ పోలీసులకు  కేరళ నుంచి యూనిఫామ్

తిరువనంతపురం: ఇజ్రాయెల్ పోలీసులకు కేరళలోని ఓ బట్టల ఫ్యాక్టరీ యూనిఫామ్ లు కుట్టి ఇస్తున్నది. ఎనిమిదేండ్లుగా  ఏడాదికి లక్ష యూనిట్లను ఇజ్రాయెల్ కు సప్లై చేస్తున్నది. ముంబైలో స్థిరపడిన కేరళ వ్యక్తి థామస్ ఒలికల్ కు.. కన్నూర్‌‌లో మార్యన్ అపారెల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన ఆర్మీ, పోలీస్ సిబ్బందితో పాటు హెల్త్ సర్వీస్ సిబ్బందికి యూనిఫామ్స్ కుట్టి ఎగుమతి చేస్తున్నది. వీరి గురించి తెలుసుకున్న ఇజ్రాయెల్ ఆఫీసర్లు 2015లో థామస్ ను కాంటాక్ట్ అయ్యారు. చర్చల అనంతరం యూనిఫామ్ కోసం  కంపెనీకి, ఇజ్రాయెల్ ఆఫీసర్లకు మధ్య డీల్ కుదిరింది. ఇక అప్పటి నుంచి కంపెనీ ఇజ్రాయెల్ పోలీసుల కోసం ఏటా లక్ష యూనిఫామ్ లను రెడీ చేసి ఎక్స్ పోర్ట్ చేస్తున్నది.  

యుద్ధం వల్ల ఎక్కువ ఆర్డర్స్ 

హమాస్  గ్రూప్ తో యుద్ధం ప్రారంభమైన తర్వాత యూనిఫామ్స్ కు ఇజ్రాయెల్ నుంచి ఎక్కువ ఆర్డర్స్ వచ్చాయని ఫ్యాక్టరీ మేనేజర్ షిజిన్ కుమార్ వెల్లడించారు. ఇజ్రాయెల్ పోలీసు అధికారులు కేరళకు వచ్చి తమ  ఫ్యాక్టరీ ఎలా పనిచేస్తుందో పరిశీలించి వెళతారని తెలిపారు. ఇప్పటి వరకు వచ్చిన ఆర్డర్‌‌లను విజయవంతంగా డెలివరీ చేశామని చెప్పారు. ఫిలిప్పియన్ ఆర్మీ, కువైట్ ఆఫీసర్లకు కూడా తమ కంపెనీనే యూనిఫామ్ లు సప్లై చేస్తున్నదని షిజిన్ పేర్కొన్నారు. మార్యన్ అపారెల్ ప్రైవేట్ లిమిటెడ్ తొలత తిరువనంతపురంలో ప్రారంభమైంది. ఇటీవల దాన్ని కన్నూర్‌‌కు షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీలో 1,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో 95% కంటే ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. అవసరాలను బట్టి కంపెనీ తన ఉద్యోగులందరికీ ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటుంది.