
మహిళల ఫోటోలను అభ్యంతరకరంగా, అశ్లీలంగా మార్చి సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్న ఓ వ్లాగర్‌ను మహిళలు చావబాదారు. రాష్ట్రం దాటి వెళ్లి మరీ కొట్టారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది.
కేరళకు చెందిన సోషల్ మీడియా వ్లాగర్ మహ్మద్ జిన్నా అనే యువకుడు romantic_ jinna_official పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో పేజ్ నిర్వహిస్తున్నాడు. అందులో పొరుగు రాష్ట్రం తమిళనాడుకు చెందిన పలువురు మహిళల ఫోటోలను అశ్లీలంగా మార్చి సోషల్ మీడియాలో సర్కులేట్ చేసినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. గత కొన్ని నెలలుగా అతని కోసం వెతుకుతున్న తమిళనాడు మహిళలు ఎట్టకేలకు అతన్ని పట్టుకొని చావబాదారు. జిన్నా దొరికిన వెంటనే పట్టుకుని కట్టేసి కొట్టడం మొదలుపెట్టారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆరేడు జిల్లాల మహిళలు
అతనికి దేహశుద్ధి చేసిన మహిళల్లో తూత్తుకుడి, సేలం, తిరుపూర్, తిరుచ్చి, హోసూర్, ధర్మపురి.. ఇలా ఆరేడు జిల్లాలకు చెందిన వారున్నారు. ఈ ఘటన కేరళ అంతటా చర్చనీయాంశం అవుతోంది. ఆరేడు జిల్లాలకు చెందిన మహిళలు పనులు మానుకొని.. కుటుంబాలను వదిలి మరీ అతని కోసం గాలించారంటే అతను అశ్లీల ఫోటోల రాజ్యం ఏ స్థాయిలో నడిపాడో అర్థం చేసుకోవచ్చు. ఇతగాడి'రొమాంటిక్ జిన్నా' ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో 57 వేలకు పైగా ఫాలోవర్లు ఉండటం గమనించదగ్గ విషయం.
సమాచారం అందుకున్న స్థానిక కేరళ అగళి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వ్లాగర్‌ను తమ వెంట తీసుకెళ్లారు. ఈ ఘటనలో వ్లాగర్, మహిళలు ఇరువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.