కరోనా కట్టడిలో కేరళ అప్పుడు బెస్ట్​.. ఇప్పుడు హయ్యెస్ట్​

కరోనా కట్టడిలో కేరళ అప్పుడు బెస్ట్​.. ఇప్పుడు హయ్యెస్ట్​
  • కరోనా కట్టడిలో కేరళ అప్పుడు బెస్ట్​.. ఇప్పుడు కేసుల్లో హయ్యెస్ట్​
  • దేశంలోని రోజువారీ కేసుల్లో 31% రాష్ట్రంలోనే..
  • వ్యాక్సినేషన్ ఎక్కువగా జరిగినా తగ్గని మహమ్మారి
  • ముప్పున్నోళ్లు ఎక్కువగా ఉండడం వల్లేనంటున్న నిపుణులు
  • అన్‌లాక్‌తో జనాల్లో నిర్లక్ష్యం

న్యూఢిల్లీ: ‘కరోనా కట్టడిలో కేరళను అన్ని రాష్ట్రాలూ ఆదర్శంగా తీసుకోవాలె’.. కరోనా దేశంలోకి ఎంటరై కల్లోలం మొదలుపెట్టినప్పుడు నిపుణులు చెప్పిన మాటిది. అంతెందుకు, డబ్ల్యూహెచ్​వో కూడా ఆ రాష్ట్రాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. కానీ, ఇప్పుడు పరిస్థితి వేరు. సీన్​ రివర్స్​ అయింది. 2 నెలలుగా అన్ని రాష్ట్రాల్లోనూ కేసులు తగ్గిపోతున్నా.. కేరళలో మాత్రం తగ్గట్లేదు. స్టడీగా పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో నమోదవుతున్న కేసుల్లో దాదాపు 33% దాకా కేరళలోనే ఉన్నాయి. దేశంలో కరోనాకు ఎపిసెంటర్​గా ఉన్న మహారాష్ట్ర, కర్నాటకను మించి నమోదవుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ 5 వేల లోపే కేసులొస్తున్నా.. కేరళలో నెలరోజులుగా 10 వేలకు తగ్గట్లేదు. దేశంలో శుక్రవారం 42,766 కేసులు నమోదైతే.. ఒక్క కేరళలోనే 13,563 మంది దాని బారిన పడ్డారు. అంటే 31.7% కేసులు ఆ రాష్ట్రానివే. 3.46 కోట్ల జనాభా ఉన్న ఆ రాష్ట్రంలో ఇప్పటికే 1,56,54,276 మందికి టీకా వేశారు.  అంటే దాదాపు 45% మందికి వ్యాక్సిన్​ అందింది. అందులో 2 డోసులూ తీసుకున్నోళ్లు 41,16,247 మంది దాకా ఉన్నారు. ప్రస్తుతం కేరళలో 30.53 లక్షల మందికిపైగా కరోనా బారిన పడ్డారు. 14,489 మంది చనిపోయారు. యాక్టివ్​ కేసులు 1,15,231 ఉన్నాయి. కేసులు, యాక్టివ్​ కేసుల్లో మహారాష్ట్ర తర్వాత కేరళే ఉంది. అయితే, అక్కడ కరోనా ఎందుకు కంట్రోల్​ కావట్లేదన్నదే ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. దానికి నిపుణులు, వైరాలజిస్టులు చెబుతున్న కారణాలివీ!

ముప్పున్నోళ్లు ఎక్కువ
దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో ముప్పున్న ప్రజలు ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. దాని వల్లే కరోనా కంట్రోల్​లోకి రావట్లేదంటున్నారు. ఫస్ట్​వేవ్​లో కేరళ కరోనాను బాగా కట్టడి చేసిందని, అప్పుడు కరోనా సోకని వాళ్లు ఇప్పుడు దాని బారిన ఎక్కువగా పడుతున్నారని ఫిజీషియన్​ డాక్టర్​ స్వప్నిల్​ పారిఖ్​ చెప్పారు. బ్రిటన్​, థాయ్​లాండ్​, ఇండోనేసియా, తైవాన్​లో ఇదే పరిస్థితి ఉందని చెప్పారు. ముప్పున్నోళ్లు ఎక్కువగా ఉండడం, కరోనా రూల్స్​ను పాటించకపోవడం వల్లే కేసులు పెరుగుతున్నాయని దేశ కరోనా జీనోమిక్స్​ కన్సార్టియం మాజీ హెడ్, వైరాలజిస్ట్​ డాక్టర్​ షాహిద్​ జమీల్​ అన్నారు.

పల్లెల్లోనూ టెస్టులు
కేరళలో పట్నాలు, పల్లెలు అని తేడాలేకుండా సమా నంగా టెస్టులు చేస్తున్నారని, దీంతో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని ఎపిడెమియాలజిస్ట్​ డాక్టర్​ చంద్రకాంత్​ లహారియా చెప్పారు. ప్రస్తుతం సగటున రోజూ 1.30 లక్షల టెస్టులు చేస్తున్నారని, దానిని 2 లక్షలకు పెంచితే కరోనా కట్టడికి అవసరమైన చర్యలు తీసుకోవచ్చని డాక్టర్​ సల్ఫీ నూహు అన్నారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో జనసాంద్రత ఎక్కువ కావడం కూడా కేసులు పెరగడానికి కారణమేనని చెప్తున్నారు.

పాజిటివిటీ రేటు 10 శాతంపైనే 
శుక్రవారం రాష్ట్రంలో 1,30,424 టెస్టులు చేశారు. ఆ లెక్కన 10.11% మందికి కరోనా సోకిం దని తేలింది. అదే దేశ సగటు పాజిటివిటీ రేటు 2.43%. నిజానికి కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న క్రమంలో జూన్​1న అక్కడ 19,760 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కొద్దికొద్ది గా తగ్గి.. జూన్​ 10న 14,424 కేసులొచ్చాయి. కానీ, అప్పటి నుంచి ఇప్పటిదాకా 11 వేల నుంచి 13 వేల మధ్యే కేసులు నమోదవుతున్నాయి.