యువత సహకారంతో గెలుస్తం.. పినరయి సర్కార్​ పై విమర్శలు

యువత సహకారంతో గెలుస్తం.. పినరయి సర్కార్​ పై విమర్శలు
  • యువత సహకారంతో కేరళలో గెలుస్తం
  • రెండు రోజుల పర్యటన కోసం కేరళ చేరుకున్న ప్రధాని
  • పినరయి సర్కారు యువతను పట్టించుకోవట్లేదని విమర్శ
  • ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని హితవు
  • కొచ్చి ‘యువం 2023’ కాన్​క్లేవ్​లో ప్రధాని మోడీ

కొచ్చి(కేరళ)/రేవా(మధ్యప్రదేశ్):  ఈశాన్య రాష్ట్రాలు, గోవాలో మాదిరి కేరళలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు. దీనికి కేరళ యువత సహకారం అవసరమన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం యూత్ గురించి పట్టించుకోవడంలేదని విమర్శించారు. రెండు రోజుల కేరళ పర్యటనలో భాగంగా మోడీ సోమవారం సాయంత్రం కొచ్చికి వచ్చారు. ఈ సందర్భంగా 2 కి.మీ మెగా రోడ్​షో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తర్వాత ‘యువం2023’ కాన్​క్లేవ్​లో ప్రధాని పాల్గొని మాట్లాడారు. ‘‘కేరళలో దొరికే ఆయుర్వేద మందులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయడానికి కేంద్రం కష్టపడుతుంటే.. ఇక్కడున్న వాళ్లలో కొందరేమో గోల్డ్ స్మగ్లింగ్​లో బిజీగా ఉన్నారు. కేరళ యువతీయువకులు ఇవన్నీ గమనిస్తున్నారు. ఇక్కడి ప్రభుత్వం వారి జీవితాలతో ఆడుకుంటోంది. ఉపాధి అవకాశాల్లేవు.. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయట్లేదు” అని సీఎం పినరయి విజయన్​ను ఉద్దేశించి పరోక్షంగా మోడీ విమర్శించారు.

స్పేస్, డిఫెన్స్​ సెక్టార్​లో ఉద్యోగాలిచ్చాం

గత కేంద్ర ప్రభుత్వాలు అన్ని రంగాలను అవినీతిమయం చేశాయని మోడీ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక యువతకు కొత్త అవకాశాలు కల్పించామన్నారు. ఆత్మనిర్భర్ భారత్ ద్వారా యువతకు ఉద్యోగాలు, వోకల్ ఫర్ లోకల్​తో ఇక్కడి వస్తువులకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చామని వివరించారు. స్పేస్, డిఫెన్స్ సెక్టార్​లో యువతకు ఉద్యోగాలు ఇచ్చామని, పీఎల్ఐ స్కీం ద్వారా తయారీ రంగాన్ని బలోపేతం చేశామని తెలిపారు. కేరళలో రోడ్డు, వాయు, సముద్ర మార్గాలను ఎంతో అభివృద్ధి చేశామన్నారు. కనీస మౌలిక సదుపాయాలు పెంపొందిస్తే  కొత్త పరిశ్రమలు వస్తాయని, టూరిజం పెరుగుతుందని అన్నారు. కొచ్చి మెట్రో పనులను వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, మంగళవారం నుంచి వందే భారత్ ఎక్స్​ప్రెస్ సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు.

గత ప్రభుత్వాలు.. గ్రామాలను విస్మరించినయ్
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో మోడీ

దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక గ్రామాలపై కాంగ్రెస్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపించిందని మోడీ విమర్శించారు. మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా రేవాలో నిర్వహించిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గ్రామాల అభివృద్ధిని కాంగ్రెస్ అస్సలు పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రజలతో పాటు స్కూళ్లు, రోడ్లు, కరెంట్ సప్లై, స్టోరేజ్ ఫెసిలిటీ.. ఇలా దేనికీ ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపించారు. చాలా రాజకీయ పార్టీలు గ్రామాల్లో విభజించు పాలించు సిద్ధాంతాన్ని అమలు చేశాయన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక గ్రామపంచాయతీలకు భారీగా నిధులు కేటాయించిందన్నారు. 2014కి ముందు పదేండ్లలో అప్పటి కేంద్ర ప్రభుత్వాల సహకారంతో దాదాపు 6వేల పంచాయతీ భవనాలు నిర్మించారని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చాక 8ఏండ్లలో 30వేల భవనాలు నిర్మించామన్నారు. 

వర్చువల్​గా అభివృద్ధి పనులకు శంకుస్థాపన

రేవాలోని ఎస్ఏఎఫ్ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో జరిగిన ప్రోగ్రామ్​లో ప్రధాన్​మంత్రి ఆవాస్​ యోజన కింద ప్రధాని మోడీ 4.11 లక్షల మంది లబ్ధిదారులకు వర్చువల్​గా గృహ ప్రవేశం చేయించారు. జల్​ జీవన్​ మిషన్​లో భాగంగా రూ.7,853 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. పీఎం స్వామిత్వ యోజన కింద 35లక్షల ప్రాపర్టీ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. రూ2,300 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. గ్వాలియర్​ స్టేషన్ రీ డెవలప్​మెంట్​తో పాటు మూడు రూట్లలో కొత్త రైళ్లను వర్చువల్​గా జెండా ఊపి ప్రారంభించారు.

బెదిరింపు లేఖ నేపథ్యంలో కాన్వాయ్​ దిగి నడిచిన మోడీ..

కేరళ టూర్​లో ప్రధానిపై దాడి చేస్తామంటూ ఇటీవల ప్రధాని కార్యాలయానికి లేఖ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోడ్​ షో సందర్భంగా ప్రధాని కారులో నుంచి దిగి, కాన్వాయ్​ ముందు నడుస్తూ ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం సభలో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలతో యువత మంచి ఫలితాలు సాధిస్తోందని మోడీ చెప్పారు. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడాని కి కేరళ యువత ముందుకొచ్చిందని చెప్పారు. ఫిషరీస్ సెక్టార్​పై ఆధారపడి జీవిస్తున్న వారిని ప్రధాన ​మంత్రి మత్స్య సంపద యోజన ద్వారా ఆదుకుంటున్నా మన్నారు. సెంట్రల్ ఆర్మ్​డ్​ పోలీస్​ ఫోర్స్ పరీక్షను మలయాళంలో రాసేందుకు అవకాశం కల్పించామన్నారు. దేశానికి ఎంతో మంది మేధావులను అందించిన ఘనత కేరళకే దక్కుతుందని మోడీ అన్నారు. ఆదిశంకరా చార్య, నారాయణ గురు వంటి ఎంతో మంది ఆధ్యాత్మికవేత్తలు ఇక్కడి నుంచే వచ్చారని మోడీ గుర్తు చేశారు.