తిరునంతపురం సెక్రటేరియట్ ముందు కాంగ్రెస్ నిరసన 

తిరునంతపురం సెక్రటేరియట్ ముందు కాంగ్రెస్ నిరసన 

కేరళలో సంచలనం సృష్టించిన బంగారం కుంభకోణం కేసు పెను దుమారం రేపుతుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం పినరయి విజయన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళన నిర్వహించారు. తిరునంతపురంలోని  సెక్రటేరియట్ ముందు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకుని నిరసన తెలిపారు. అక్కడి నుంచి వారిని చెదరగొట్టేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోవడంతో కార్యకర్తలను చెదరగొట్టేందుకు వాటర్ క్యాన్స్ తో వాటర్ కొట్టారు. బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితురాలు స్వప్న సురేష్ సీఎం పినరయి విజయన్, అతని బంధువులు, అధికారుల ప్రమేయాన్ని వెల్లడించారు. దీనికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెస్ తిరువునంతపురంలో ధర్నా నిర్వహించింది. కేరళ గోల్డ్ స్మగ్లింగ్ పై ఆరోపణలు చేసిన నిందితురాలు స్వప్న సురేశ్‌పై కేరళ మాజీ మంత్రి, సీపీఐ(ఎం) నేత కేటీ జలీల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.స్వప్న సురేష్, మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జ్, బీజేపీ కలిసి కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. 

2016లో సీఎం దుబాయ్ పర్యటన సందర్భంగా.. మాజీ ప్రిన్స్ పల్ సెక్రటరీ ఎం. శివశంకర్ తనను సంప్రదించడం జరిగిందని, సామానును అక్కడకు పంపించాలని కోరినట్లు స్వప్న సురేష్ ఆరోపించారు. దుబా య్ లోని కాన్సులేట్ లోని ఓ దౌత్య అధికారికి తాను బ్యాగు ఇవ్వడం జరిగిందని, అక్కడ స్కానింగ్ నిర్వహించగా..బ్యాగులో డబ్బు ఉందన్నారు. అప్పటి నుంచి బంగారం స్మగ్లింగ్ వ్యాపారం మొదలైందని చెప్పారు.

దుబాయి కాన్సులేట్ నుంచి నివాసానికి ఓ పాత్రలో విలువైన లోహాలను తరలించారని, కోర్టు ఆదేశాలకు మేరకు ఈడీ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించలేమని వ్యాఖ్యానించారు. తనకు ప్రాణహాని ఉందని..అందుకే ఈ కేసుకు సంబంధించిన అన్ని వాస్తవాలను కోర్టు ముందు వెల్లడిస్తానన్నారు. 2020 జూలై 05న తిరువనంతపురం విమానాశ్రయంలోని యూఏఈ (UAE) కాన్సులేట్ లో రూ. 15 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకోవడంతో స్మగ్లింగ్ రాకెట్ గుట్టురట్టైంది.