దక్షిణాదిలో ఫ్రెండ్లీ పాలిటిక్స్.. తమిళనాడులో విజయ్.. కేరళలో వీడీ సతీశన్ !

దక్షిణాదిలో ఫ్రెండ్లీ పాలిటిక్స్.. తమిళనాడులో విజయ్.. కేరళలో వీడీ సతీశన్ !

తిరువనంతపురం: కేరళకు కాబోయే సీఎం వీడీ సతీశన్ ఫ్రెండ్లీ పాలిటిక్స్కు తెరలేపారు. మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను తిరువనంతపురంలోని ఆయన ఇంటికి వెళ్లి మరీ కలిశారు. విజయన్ కుటుంబ సభ్యులతో సతీశన్ సరదాగా ముచ్చటించారు. వీడీ సతీశన్కు పినరయి విజయన్ శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలతో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నప్పటికీ వ్యక్తిగత పగలు, ప్రతీకారాలకు తావు ఉండకూడదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

దక్షిణాదిలో ఈ తరహా ఫ్రెండ్లీ పాలిటిక్స్ ఈ మధ్య కాలంలో తమిళనాడులో కూడా కనిపించాయి. తమిళనాడు సీఎం విజయ్ కూడా స్టాలిన్ను ఆయన ఇంటికి వెళ్లి కలిసి శాలువా కప్పి సత్కరించిన సంగతి  తెలిసిందే. తమిళనాడు, కేరళలో ఈ తరహా ఫ్రెండ్లీ పాలిటిక్స్ ఇతర రాష్ట్రాలకు స్పూర్తిదాయకంగా నిలిచాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. విజయ్, వీడీ సతీశన్ చూపించిన చొరవపై నెటిజన్ల నుంచి కూడా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

కేరళ నూతన ముఖ్యమంత్రిగా సీనియర్ నేత వీడీ సతీశన్ పేరును కాంగ్రెస్ అధిష్టానం గురువారం అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. సీఎం పదవికి వీడీ సతీశన్‌‌‌‌తో పాటు కేసీ వేణుగోపాల్, రమేశ్ చెన్నితాల పేర్లు బలంగా వినిపించాయి. అయితే, మే 7న తిరువనంతపురంలో జరిగిన సమావేశంలో సీఎల్పీ(కాంగ్రెస్ శాసనసభా పక్ష ) నేతగా ఎవరిని ఎంపిక చేయాలనే బాధ్యతను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తూ ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం అందరి ఆమోదంతో సతీశన్‌‌‌‌ను సీఎల్పీ నేతగా నియమించారు.