
- ఎస్పీ ఆధ్వర్యంలో 160 మంది పోలీసుల తనిఖీ
బోథ్(ఇచ్చోడ), వెలుగు: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నంలో గురువారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ అఖిల్ మహాజన్, ఉట్నూర్అడిషనల్ఎస్పీ కాజల్‌సింగ్, డీఎస్పీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుంచే 160 మంది పోలీసులు గ్రామాన్ని తనిఖీ చేశారు. గంజాయి సాగు నేపథ్యంలో నార్కొటిక్ డాగ్‌తో తనిఖీ చేశారు.
సరైన పత్రాలు లేని 82 బైక్లు, 18 ఆటోలు, మరో ఫోర్ వీలర్‌ను స్వాధీనం చేసుకున్నన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గ్రామంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు చేపట్టవద్దన్నారు. ఈ గ్రామం నుంచి గత ఐదేండ్లలో 90 కేసులు నమోదయ్యాయని, ఇక నుంచి సన్మార్గంలో నడవాలని సూచించారు.
గ్రామంలో నమోదైన రౌడీషీట్లు, సస్పెక్ట్ షీట్లను ఏడాది పాటు పరిశీలించి ఎలాంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొననివారిపై వాటిని ఎత్తివేస్తామని చెప్పారు. అక్రమంగా కలప రవాణాను, చెట్లను నరికి వేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పోతారం శ్రీనివాస్, సీఐలు బండారి రాజు, ఎం.ప్రసాద్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
రాచాపూర్ లో 52 బైక్లు..
లక్ష్మణచాంద, వెలుగు: నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని రాచాపూర్‌లో సోన్ సీఐ గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 52 బైక్ లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకొని పెండింగ్ ఛలానాలను పరిశీలించి జరిమానాలు విధించినట్లు తెలిపారు. సైబర్ నేరాలు, ట్రాఫిక్ సమస్యలు, గంజాయి, సీసీ కెమెరాల ప్రాముఖ్యత, మత్తు పదార్థాలపై గ్రామస్తులకు సీఐ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్సైలు శ్రీనివాస్, అశోక్, సిబ్బంది పాల్గొన్నారు.