కేతకి బ్రహ్మోత్సవాలు షురూ.. 

కేతకి బ్రహ్మోత్సవాలు షురూ.. 
  • కేతకి బ్రహ్మోత్సవాలు షురూ.. 
  • అందని ప్రభుత్వ సాయం... 
  • ఆలయ సొంత నిధులతోనే ఏర్పాట్లు

సంగారెడ్డి/ఝరాసంగం, వెలుగు :  సంగారెడ్డి జిల్లా మొగిలి వనంలోని ఝరాసంగం కేతకి సంగమేశ్వర మహాక్షేత్రం మహాశివరాత్రి నవాహ్నిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. అష్ట తీర్థాల సంగమమైన ఈ ఆలయంలో ఈనెల 15 నుంచి 23 వరకు మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. మంజీర తీరాన కొలువుదీరిన పార్వతీసమేత సంగమేశ్వర స్వామిని భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. యూపీలోని కాశీ విశ్వనాథ ఆలయం తర్వాత అంతటి ప్రఖ్యాతి గాంచిన కేతకి ఆలయం ఇది.  కేతకి పుష్పాలతో శివలింగ అర్చన చేసే ఏకైక దివ్య క్షేత్రం కూడా ఇదే. ఆలయాన్ని సందర్శించేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, కర్నాటక నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఇక్కడి అమృత గుండంలోని నీటిని తాగినా.. స్నానం చేసినా దీర్ఘరోగాలు మాయమవుతాయని భక్తుల విశ్వాసం. ఈ గుండం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండగా ఆలయంలో ప్రత్యేకతలు గల కొన్ని ఉపాలయాలు ఉన్నాయి. ఆలయానికి కుడివైపున దుష్టశక్తులను పోగొట్టే హనుమంతుడిని దర్శించుకుంటారు. గ్రహ రాజులుగా పేరుగాంచిన నవగ్రహ సన్నిధికి చేరుకుని గ్రహ దోషాలను పోగొట్టే పూజలు చేస్తారు. అక్కడి నుంచి అమృత గుండం వద్ద ఉన్న కోరికల లింగాన్ని దర్శిస్తారు. 

ఏర్పాట్లు ఇలా...

కేతకి సంగమేశ్వర ఆలయం ఉత్సవాలకు ప్రభుత్వం స్పెషల్ ఫండ్స్ రిలీజ్ చేయకపోయినా హుండీ ద్వారా వచ్చిన ఆదాయంతోనే నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ శరత్ రూ.10 లక్షలు శాంక్షన్ చేసినట్టు ప్రచారం జరుగుతున్నా మంగళవారం సాయంత్రం వరకు పైసా ఇయ్యలేదు. దీంతో ఆలయ సొంత నిధులతోనే భక్తుల స్నానాల కోసం 36 షవర్లు, మున్సిపల్ శాఖ తరఫున మూడు మొబైల్ టాయిలెట్స్, తాగునీటి కోసం మిషన్ భగీరథ, పారిశుధ్య నిర్వహణ, వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఒక అంబులెన్స్ తో పాటు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 150 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేయగా జహీరాబాద్ ఆర్టీసీ డిపో నుంచి 15 నిమిషాలకు ఒక బస్సు చొప్పున నడిపేందుకు చర్యలు చేపట్టారు. ధర్మ దర్శనంతో పాటు ప్రత్యేక, వీఐపీ దర్శనాలు ఉండేలా ఏర్పాట్లు చేశారు.

ఉత్సవాలకు అంతా సిద్ధం 

సంగమేశ్వర ఆలయ ఉత్సవాలకు ఆలయ పాలకమండలి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశాం. ఉత్సవాల కోసం ప్రభుత్వం నుంచి  రూ.10 లక్షలు శాంక్షన్ చేసినట్టు అధికారులు చెబుతున్నారు.. కానీ మంగళవారం సాయంత్రం వరకు ఆ నిధులు అందలేదు. ఇస్తారని ఆశిస్తున్నాం.
– ఆలయ ఈఓ శశిధర్