‘యూత్ పార్లమెంట్’లో మెరిసిన మౌనిక

‘యూత్ పార్లమెంట్’లో మెరిసిన మౌనిక

న్యూఢిల్లీ/కామారెడ్డి, వెలుగు: గుడ్ గవర్నెన్స్ డేను పురస్కరించుకొని ఆదివారం పార్లమెంట్ లోని సెంట్రల్ హాల్ లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ‘యూత్ పార్లమెంట్’ సమావేశంలో తెలంగాణ గిరిజన బిడ్డ కేతావత్ మౌనిక ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని మోడీ చీఫ్ చీఫ్ గెస్ట్ లుగా హాజరైన ఈ సమావేశంలో ప్రముఖ విద్యావేత్త, ఫ్రీడమ్ ఫైటర్ మదన్ మోహన్ మాలవీయ, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయిపై మూడు నిమిషాలు మాట్లాడేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించారు. ఇందులో మౌనిక మాజీ ప్రధాని వాజ్ పేయి గురించి స్పీచ్ ఇచ్చి అందరి ప్రశంసలు అందుకున్నది.

సమావేశంలో జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, తెలంగాణ, యూపీ, మహారాష్ట్ర, బిహార్ కు చెందిన ఏడుగురు విద్యార్థులు స్పీచ్ ఇచ్చారు. మౌనిక కామారెడ్డిలోని ఆర్కే పీజీ కాలేజీలో ఎంఎస్ డబ్ల్యూ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. యూత్ పార్లమెంట్ లో స్పీచ్ సందర్భంగా ఆమె ‘వీ6 వెలుగు’తో మాట్లాడుతూ.. దేశం దేవాలయంగా భావించే పార్లమెంట్ లో ప్రసంగించే అవకాశం దక్కినందుకు గర్వంగా ఉందని చెప్పింది. తన తల్లి సునీత వ్యవసాయ కూలీగా, తండ్రి నర్సింలు డీసీఎం డ్రైవర్ గా పని చేస్తున్నారని, వారితో పాటు ఆర్కే కాలేజీ ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి చేరానని తెలిపింది. మౌనికను ఆర్కే కాలేజీ సీఈఓ జైపాల్ రెడ్డి, డీన్ నవీన్, లెక్చరర్లు అభినందించారు.