
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసుతో సంబంధం ఉన్న ఎవరని వదలమని.. ప్రతి ఒక్కరిని విచారిస్తామని తేల్చి చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని.. కేసులో కీలక నిందితులను ఇప్పటికే అరెస్టు చేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులకు ముందు బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేయాలనుకున్నామని, కానీ బ్లూ కార్నర్ నోటీసులతో వారిని యూఎస్ నుండి ఇండియాకి తీసుకురాలేమన్నారు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులపై రెడ్ కార్నర్ నోటీసులను జారీ చేయాలని సీబీఐ డైరెక్టర్ని కోరామని తెలిపారు.
ALSO READ | అందరూ కోర్టు ఆదేశాలు ఫాలో అవ్వాల్సిందే: సీపీ శ్రీనివాస్ రెడ్డి
సీబీఐ రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత నిందితులను ఇండియాకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. కాగా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురు ప్రతిపక్ష నేతలు, వ్యాపార వేత్తలు, సెలబెట్రీల ఫోన్లు ఎస్ఐబీ అధికారులు ట్యాపింగ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ కేసులో ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్నలను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే.