
తిరుమల పవిత్రతను కాపాడటం తమ ప్రధాన కర్తవ్యమని, సప్తగిరులను అన్యాక్రాంతం కానివ్వబోమని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో మంగళవారం (ఆగస్టు 26) సాయంత్రం బోర్డు సభ్యులు జి.భాను ప్రకాష్ రెడ్డి, డాలర్ దివాకర్ రెడ్డి, పనబాక లక్ష్మి, జేఈవో వీరబ్రహ్మంతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
టీటీడీ మీద జరుగుతున్న విషప్రచారాన్ని ఖండించిన బీఆర్ నాయుడు.. భక్తుల సౌకర్యాలకే తాము కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. కానీ కొందరు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను వక్రీకరిస్తున్నారని అన్నారు. 2008లో పీపీపీ ద్వారా 30.32 ఎకరాల టూరిజం భూమిని దేవలోక్‌కి ఇవ్వాలని ఎంవోయూ కుదుర్చుకున్నారని తెలిపారు. 2011లో ఇంటర్నేషనల్ బిడ్డింగ్ ప్రాసెస్ ద్వారా ఎల్‌ఓఐ ఇవ్వగా, 2014లో టూరిజం శాఖ కేటాయింపులు జరిపిందని తెలిపారు. 2021లో కేంద్రం ఎన్విరాన్‌మెంట్ క్లియరెన్స్ ఇచ్చిన విషయాలను గుర్తు చేశారు. గత ప్రభుత్వం ముంతాజ్ హోటల్‌కు 20 ఎకరాలు, మేడా ప్రాజెక్ట్‌కు 5 ఎకరాలు ఇచ్చిందని తెలిపారు.
ముంతాజ్ హోటల్‌కు భూములు కేటాయించడంపై అప్పట్లో హిందూ సంఘాలు ధర్నాలు చేశాయని అన్నారు. 2024 నవంబరు 18న బోర్డు ముంతాజ్ హోటల్ భూమి కేటాయింపు సబబు కాదని తీర్మానించి ప్రభుత్వానికి పంపిందని.. సీఎం చంద్రబాబు జోక్యంతో స్థలం మార్పిడి ప్రక్రియ మొదలైందని చెప్పారు.
వైసీపీ పాలనలోనే భూకేటాయింపులు:
టీటీడీ భూములను ప్రైవేట్ వారికి ఇచ్చింది వైసీపీ పాలనలోనేనని అన్నారు బీఆర్ నాయుడు. కేటాయింపులు జరగకపోతే ఈ సమస్యే వచ్చేది కాదని.. ఇప్పుడు సీబీఐ విచారణ కోరడం హాస్యాస్పదమని అన్నారు. దేవలోక్ నిర్మాణం కోసం స్థలాన్ని లీజుకు తీసుకున్న అజయ్ కుమార్ ను జగన్ తాడేపల్లికి పిలిపించి గన్ పెట్టి బెదిరించారని సంచలన ఆరోపణలు చేశారు. శేషాచలం కొండల కింద ఉన్న స్థలాన్ని ఒబెరాయ్ హోటల్ కు కేటాయించింది జగన్ అని.. దేవలోక్ కు కేటాయించిన 10ఎకరాల స్థలాన్ని వెనక్కి తీసుకుంటామని చెప్పారు. టీటీడీపైన బురద జల్లుతున్న భూమనను తిరుపతి నుంచి తరిమి కొట్టాలని అన్నారు.
నూతన పాలక మండలి వచ్చిన తర్వాత భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన తప్ప తమకు ఇతర ఉద్దేశం లేదని తెలిపారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా ఎవరూ మాట్లాడకూడదని హెచ్చరించారు బీఆర్ నాయుడు. టీటీడీ బోర్డు రోడ్డుకు ఎదురుగా ఉన్న భూమిని టూరిజం శాఖకు కేటాయించేందుకు నిర్ణయం తీసుకుని ప్రభుత్వ ఆమోదం కోసం పంపిందని ఆయన తెలిపారు.
2019–24 మధ్య హిందూ వ్యతిరేక ప్రభుత్వం రాజ్యమేలిందని, శ్రీవారి పరకామణి అవినీతి కేసును మళ్లీ దర్యాప్తు చేయిస్తామని బోర్డు సభ్యులు అన్నారు. ముంతాజ్ హోటల్ అంశం గత ప్రభుత్వ హయాంలోనే బయటపడిందని అన్నారు. ప్రతిపక్షాలకు ఆరోపణలకు ఆధారం లేక, తమ పాలనలో జరిగిన తప్పులను ప్రస్తుత బోర్డుపై మోపుతున్నారని విమర్శించారు.