పదేండ్లుగా డ్రగ్స్ దందా.. ప్రతి డెలివరీలో 5 కిలోల మెఫెడ్రోన్.. కిలో రూ.50 లక్షల చొప్పున అమ్మకం

పదేండ్లుగా డ్రగ్స్ దందా.. ప్రతి డెలివరీలో 5 కిలోల మెఫెడ్రోన్.. కిలో రూ.50 లక్షల చొప్పున అమ్మకం
  • చర్లపల్లి ‘డ్రగ్స్ డెన్’ కేసులో కీలక విషయాలు వెలుగులోకి
  • సీజ్ చేసిన కెమికల్స్ థానేకు తరలింపు
  • అలర్ట్ అయిన రాష్ట్ర పోలీస్ శాఖ, ఈగల్ ఫోర్స్

హైదరాబాద్, వెలుగు: చర్లపల్లిలో బయటపడ్డ డ్రగ్స్ దందాలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మహారాష్ట్ర క్రైం బ్రాంచ్‌‌ పోలీసులకు చిక్కిన శ్రీనివాస్‌‌ విజయ్‌‌ ఓలేటి బృందం గత 10 ఏళ్లుగా డ్రగ్స్‌‌ తయారు చేసి డీలర్లకు విక్రయిస్తున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ప్రతిసారి కనీసం 5 కిలోల చొప్పున మెఫెడ్రోన్ డ్రగ్‌‌ను విక్రయించేవారని, ఒక్కో కిలో రూ.50 లక్షల చొప్పున ఏజెంట్లకు అమ్మేవారని గుర్తించారు.

చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలోని వాగ్దేవి ల్యాబొరేటరీస్​లో శుక్రవారం మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడులు చేయడం తెలిసిందే. ఈ దాడుల్లో రూ.12 వేల కోట్ల విలువ చేసే మాదకద్రవ్యాలు(సింథటిక్ డ్రగ్స్) తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన ముడి రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు.  స్వాధీనం చేసుకున్న 5 కిలోల 968 గ్రాముల ఎండీ (మెఫెడ్రోన్‌‌‌‌), 35,500 లీటర్ల ఇతర కెమికల్స్‌‌‌‌, 19 బాక్స్‌‌‌‌లలోని 950 కిలోల మిథైలిన్‌‌‌‌ డైక్లోరైడ్‌‌‌‌ (ఎండీసీ) పొడి సహా మెఫెడ్రోన్‌‌‌‌ (ఎండీ) తయారీకి వాడే ఇతర రసాయనాలు కలిపి మొత్తం 200 డ్రమ్ముల్లో ఉన్న కెమికల్స్ ని, నాచారంలోని వాగ్దేవి ఇన్ఫో సైన్స్లో భారీగా నిల్వచేసిన డ్రగ్ పౌడర్​ను ఆదివారం రెండు లారీలలో థానేకు తరలించారు. అదేవిధంగా ఈ కేసులో అరెస్టు అయిన శ్రీనివాస్ విజయ్ ఓలేటి, అతడితో కలిసి పనిచేస్తున్న తానాజి పండరినాథ్‌‌‌‌ పట్వారీని శనివారం థానే కోర్టులో హాజరుపరిచి రిమాండ్​కు తరలించారు. సోమవారం కస్డడీ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది.

రాష్ట్ర పోలీసులు, ఈగల్ ఫోర్స్ అలర్ట్  
చర్లపల్లి డ్రగ్స్ కేసు నేపథ్యంలో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని చిన్న తరహా ఫార్మా కంపెనీల్లో తయారవుతున్న కెమికల్స్​పై రాచకొండ పోలీసులు, ఈగల్‌‌‌‌ (ఎలైట్‌‌‌‌ యాక్షన్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ ఫర్‌‌‌‌ డ్రగ్‌‌‌‌ లా ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌), హైదరాబాద్‌‌‌‌ నార్కోటిక్స్‌‌‌‌ ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ వింగ్‌‌‌‌ (హెచ్‌‌‌‌-న్యూ), డీసీఏ (డ్రగ్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌) సిబ్బంది అలర్ట్ అయ్యారు. మూతపడ్డ పరిశ్రమలు, రసాయన గోదాంల ప్రస్తుత పరిస్థితి ఏంటి? వాటిలో ఏం నిల్వచేస్తున్నారన్న అంశాలపై దృష్టి పెట్టారు.

ఈ మేరకు నగరంలో మత్తు పదార్థాలు తయారు చేసే ఫ్యాక్టరీలపై ఇప్పటికే దృష్టి పెట్టామని, గతంలోనూ ఆల్ఫ్రాజోలం, ఎఫిడ్రిన్‌‌‌‌ సహా ఇతర మత్తుపదార్థాలను గుర్తించిన ఘటనలు ఉన్నాయని ఈగల్‌‌‌‌ ఫోర్స్ కు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. అయితే,  కెమికల్‌‌‌‌ ఫ్యాక్టరీల్లో సోదాలు డ్రగ్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌ (డీసీఏ) పరిధిలోకి వస్తాయని, అందుకే డీసీఏతో కలిసి ఈగల్‌‌‌‌ బృందాలు ఈ సోదాల్లో పాల్గొంటున్నాయని తెలిపారు.