
న్యూఢిల్లీ: భారత్, పాక్ ఉద్రిక్తతల వేళ ప్రధాని మోడీ నివాసంలో శుక్రవారం (మే 9) కీలక భేటీ నిర్వహించారు. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి భారత త్రివిధ దళ ఉన్నతాధికారులు హాజరయ్యారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. గురువారం (మే 8) రాత్రి పాక్ చేసిన దాడులు, దానికి కౌంటర్‌గా భారత ప్రతిదాడులకు సంబంధించిన పరిణామాలను అధికారులను ప్రధానికి వివరించారు. ఉద్రిక్తతల వేళ త్రివిధ దళాధిపతులతో ఒకేసారి ప్రధాని భేటీ కావడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా, ఆపరేషన్ సిందూర్‌కు కౌంటర్‌గా గురువారం (మే 8) రాత్రి భారత్ లోని పలు ప్రాంతాలపై పాక్ దాడులకు ప్రయత్నించింది. భారత సైనిక స్థావరాలు, ప్రార్థనా స్థలాలు, ఎయిర్ పోర్టులే లక్ష్యంగా మిసైళ్లు, డ్రోన్లతో ఎటాక్ చేసింది. వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం.. పాక్ దాడులకు ఎక్కడికక్కడే తిప్పికొట్టింది. అదే సమయంలో పాక్ దాడులకు ధీటుగా కౌంటర్ ఎటాక్ చేసింది. పాక్ లోని పలు ప్రాంతాలపై డ్రోన్లతో దాడి చేసింది. ఇరు దేశాల మధ్య పరస్పర దాడులతో గురువారం (మే 8) రాత్రి బోర్డర్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో గురువారం రాత్రి జరిగిన పరిణామాలను త్రివిధ దళాల ఉన్నతాధికారులు ప్రధాని మోడీ క్షుణ్ణంగా వివరించారు.