
శంషాబాద్, వెలుగు: ఏపీ లిక్కర్ స్కాం కేసు కొత్త మలుపు తిరిగింది. శంషాబాద్ మండలంలోని ఓ ఫాంహౌస్‌లో అట్టపెట్టెలో దాచి ఉంచిన రూ. 11 కోట్ల క్యాష్‌ను ఏపీ సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లిక్కర్ సిండికేట్ స్కాం కేసులో వేగం పెంచిన సిట్ అధికారులు ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు. బుధవారం శంషాబాద్ మండలం కాచారం గ్రామ పరిధిలోని సులోచన గెస్ట్ హౌస్‌లో రూ. 11 కోట్ల క్యాష్ ను సీజ్ చేసినట్టు వెల్లడించారు. మొత్తం12 అట్టపెట్టెల్లో భారీ ఎత్తున క్యాష్‌ను దాచిపెట్టినట్టు గుర్తించామన్నారు.
ఈ కేసులో ఏ40గా ఉన్న వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించిన తర్వాత ఈ డబ్బు విషయం బయటపడిందన్నారు. వరుణ్ తోపాటు వినయ్ అనే మరో వ్యక్తి 2024, జూన్‌లో ఏపీ ప్రభుత్వ మాజీ ఐటీ సలహాదారు, ఏ1 కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మరో నిందితుడు చాణక్య సూచనల మేరకు ఈ నగదును ఫాంహౌస్‌లో దాచిపెట్టినట్టు సిట్ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో మొత్తం రూ. 3,500 కోట్ల ఆర్థిక అవకతవకలు జరిగినట్టు తేలిందన్నారు.
కాగా, ఈ లిక్కర్ సిండికేట్ స్కాంలో గత వైసీపీ సర్కారులోని అనేక మంది ప్రముఖులకు సంబంధం ఉందని, ఇందుకు సంబంధించి కీలక ఆధారాలను సిట్ సేకరించిందని భావిస్తున్నారు. ఈ కేసులో పెద్దల ప్రమేయం త్వరలోనే బయటపడే అవకాశాలు ఉన్నాయని, రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులను ప్రకటించనున్నారని చెప్తున్నారు.