- భైంసా, నిర్మల్ మార్కెట్లో.. కిలో టమాటా రూ.200
- ఏపీలోని మదనపల్లి నుంచి దిగుమతి
- ట్రాన్స్పోర్ట్ చార్జీల కారణంగా పెరిగిన ధరలు
భైంసా/నిర్మల్, వెలుగు: భైంసా, నిర్మల్ మార్కెట్లో సోమవారం టమాటా ధర కిలో రూ.200 దాటింది. ఆదివారం రూ.160 ఉండగా.. ఒక్కరోజులోనే రూ.200కు చేరడంతో ప్రజలు షాక్ అయ్యారు. హైదరాబాద్, నాందేడ్, ఔరంగాబాద్, ఏపీలోని మదనపల్లి నుంచి నిర్మల్, భైంసా మార్కెట్లకు టమాటా వస్తున్నది. సోమవారం పొద్దున మార్కెట్కు టమాటా రాగానే.. హోల్సేల్ వ్యాపారులు ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రిటైల్ వ్యాపారులు కిలో రూ.200కు అమ్మక తప్పలేదు.
ఇది వరకు ఎండలు మండిపోవడంతో దిగుబడులు రాక టమాటా కొరత ఏర్పడింది. దాంతో రేటు ఒక్కసారిగా వంద రూపాయలకు చేరింది. ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా పంట మొత్తం దెబ్బతిన్నది. దీంతో దిగుమతుల మీద ఆధారపడాల్సి వస్తున్నది. ఎక్కువగా ఏపీలోని మదనపల్లి నుంచి టమాటా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. దాదాపు 800 కిలో మీటర్ల దూరం నుంచి తెప్పిస్తుండటంతో ట్రాన్స్పోర్ట్ చార్జీలు తడిసిమోపెడవుతున్నాయి. దీంతో ధర కూడా పెంచక తప్పడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఇంకా 10 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని అంటున్నారు.