ఉన్న చోటనే మళ్లీ నియామకం.... కేజీబీవీలోనే అడిషనల్ గా ఇన్‌స్ట్రక్టర్ల నియామకం

ఉన్న చోటనే మళ్లీ నియామకం.... కేజీబీవీలోనే అడిషనల్ గా ఇన్‌స్ట్రక్టర్ల నియామకం
  •  విద్యాశాఖ వింత వైఖరితో  కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు  అయోమయం

మెదక్, వెలుగు: పుష్కర కాలం తర్వాత మళ్లీ సమగ్ర శిక్ష అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ హైస్కూళ్లలో కంప్యూటర్ విద్యకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1,644  కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించారు. 

అయితే ఖాళీ ఉన్న చోట కాకుండా గతంలోనే ఇన్‌స్ట్రక్టర్​ఉన్న చోటనే అడిషనల్​మరొకరిని నియమించడం విద్యాశాఖ వింత వైఖరికి నిదర్శనం. ఎంపిక చేసిన స్కూళ్లలో డిజిటల్​విద్య బలోపేతం, వివిధ డిజిటల్​విద్యావిధానాల అమలు కోసం ఔట్​సోర్సింగ్​పద్ధతిలో ఇన్‌ఫర్మేషన్​అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ (ఐసీటీ) ఇన్‌స్ట్రక్టర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 వీరి నియామకాల కోసం తెలంగాణా టెక్నికల్​సర్వీస్​లిమిటెడ్​ మూడు ఏజెన్సీలను ఖరారు చేసింది. ఈ ఏజెన్సీల ద్వారా స్కూల్‌కు ఒకరి చొప్పున 1,644  మంది ఇన్‌స్ట్రక్టర్లను నియమించారు. రూల్స్ ప్రకారం ఒక్కో ఇన్‌స్ట్రక్టర్‌‌కు రెండు స్కూళ్ల బాధ్యతలు అప్పగించారు. 

దీంతో మొత్తం 3,288 స్కూళ్లలో కంప్యూటర్‌‌ విద్య అందించాల్సి ఉంటుంది. కాగా హైస్కూల్‌తోపాటు పీఎంశ్రీ అమలవుతున్న కేజీబీవీల్లో సైతం ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్లను నియమించారు. అయితే ఆయా కేజీబీవీల్లో దాదాపు 10 ఏండ్ల క్రితం నుంచే ఇన్‌స్ట్రక్టర్లు ఉన్నారు. 

కాగా ఇపుడు అవే కేజీబీవీలకు అడిషనల్‌గా మరో ఇన్‌స్ట్రక్టర్‌‌ను నియమించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏజెన్సీల ద్వారా ఎంపికై ఇన్‌స్ట్రక్లర్లు కేజీబీవీల్లో తమకు కేటాయించిన విధుల్లో చేరారు. అయితే వారికి జాబ్​చార్ట్​ఇవ్వలేదు. దీంతో వారికి ఏ పనిచెప్పాలో తెలియక కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు  అయోమయానికి గురవుతున్నారు.