దంగల్, బాహుబలి 2 తర్వాత కేజీఎఫ్ దే రికార్డ్

దంగల్, బాహుబలి 2  తర్వాత కేజీఎఫ్ దే రికార్డ్

‘భారత దేశానికి నేను సీఈవో’ను అంటూ ‘కేజీయఫ్‌‌ 2’లో చెప్తాడు రాఖీ భాయ్. ఆ డైలాగ్ ఇప్పుడు ‘కేజీయఫ్‌‌’ కలెక్షన్ల విషయంలో బాగా వినిపిస్తోంది. ఊహించిన దానికంటే భారీ వసూళ్లతో సీఈవో ఆఫ్ బాక్సాఫీస్‌‌గా మారింది ‘కేజీయఫ్‌‌ 2’ చిత్రం. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందించిన ఈ మూవీ భారీ కలెక్షన్స్‌‌తో దూసుకెళ్తోంది. దేశవ్యాప్తంగా వెయ్యి కోట్ల గ్రాస్‌‌ను దాటింది, వరల్డ్ వైడ్‌‌గా పన్నెండు వందల కోట్ల మార్క్‌‌ను క్రాస్‌‌ చేసింది. థియేటర్స్‌‌లో ఈ చిత్రం విడుదలై ముప్ఫై ఐదు రోజులవుతోంది. పే పర్ వ్యూ విధానంలో ఓటీటీలోనూ స్ట్రీమ్‌‌ అవుతోంది. అయినా థియేటర్‌‌‌‌ దగ్గర మాత్రం హవా తగ్గడం లేదు. విశేషమేమిటంటే.. ఇటీవల కొన్ని బాలీవుడ్ సినిమాలు  రిలీజయ్యాయి. అయినప్పటికీ ‘కేజీయఫ్ 2’ హిందీలో 430 కోట్లు రాబట్టడం విశేషం. విడుదలైన ఐదు వారాల్లో ఓవర్సీస్ సహా అన్ని భాషలూ కలుపుకుని 1212 కోట్ల వసూళ్లు రాబట్టి.. దంగల్, బాహుబలి 2 చిత్రాల తర్వాత హయ్యెస్ట్ గ్రాసింగ్‌‌ ఇండియన్‌‌ సినిమాగా నిలిచింది. దీంతో బాక్సాఫీస్‌‌ సీఈవో అంటూ యశ్ ఫ్యాన్స్‌‌ ఖుషీ అయిపోతున్నారు.

హోంబలే సంస్థ భారీ బడ్జెట్‌‌తో నిర్మించిన ఈ చిత్రంపై శంకర్ లాంటి దర్శకులు కూడా పొగడ్తల జల్లు కురిపిస్తున్నారు. కాస్త ఆలస్యంగా ఈ సినిమా చూసిన ఆయన.. యశ్‌‌ని మాస్‌‌కి పవర్‌‌‌‌ హౌస్‌‌గా ప్రశాంత్‌‌ నీల్‌‌ ప్రెజెంట్‌‌ చేసిన తీరు తనకి చాలా నచ్చిందని, స్క్రీన్‌‌ ప్లే, ఎడిటింగ్, డైలాగ్స్, కటింగ్ ఎడ్జ్‌‌ స్టైల్‌‌లో కథ చెప్పడం లాంటివన్నీ వర్కవుటయ్యాయని ప్రశంసించారు. ‘కేజీయఫ్‌‌’ దేశం మొత్తంలో ప్రకంపనలు సృష్టించింది. ప్రాంతీయ చిత్రాలు కూడా ఇండియన్‌‌ బాక్సాఫీస్‌‌ను శాసిస్తాయని ‘బాహుబలి 2’ తర్వాత మరోసారి ప్రూవ్ చేసింది. త్వరలోనే ‘కేజీయఫ్ 3’ ని కూడా పట్టాలెక్కించబోతున్నట్టు ఇటీవలే నిర్మాత విజయ్ కిరగందూర్ ప్రకటించారు. దాంతో మరో సెన్సేషన్ ఖాయమంటూ ఫ్యాన్స్ సంతోషపడ్తున్నారు.