మరికొన్ని గంటల్లో ఖైరతాబాద్ బడా గణేశ్ శోభా యాత్ర.. మధ్యాహ్నం 12 లోపే నిమజ్జనం.. రూట్ మ్యాప్ ఇదే..

మరికొన్ని గంటల్లో ఖైరతాబాద్ బడా గణేశ్ శోభా యాత్ర.. మధ్యాహ్నం 12 లోపే నిమజ్జనం.. రూట్ మ్యాప్ ఇదే..

హైదరాబాద్: ఖైరతాబాద్ బడా గణేశ్ ​శోభా యాత్ర సెప్టెంబర్ 25న ఉదయం 6 గంటలకు మండపం నుంచి ప్రారంభం కానున్నది. ప్రతి సారి లెక్కనే ఖైరతాబాద్ గణేశ్ మండపం నుంచి మొదలై..సెన్సేషన్ థియేటర్, రాజ్‌‌‌‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్, తెలుగుతల్లి చౌరస్తా మీదుగా లుంబినీ పార్క్ పక్కన ఉన్న ఎన్టీఆర్ మార్గ్ కు చేరుకుంటుంది. నిమజ్జనాన్ని మధ్యాహ్నం 12 గంటలలోపే పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

దీని కోసం హుస్సేన్‌‌‌‌సాగర్ ఎన్టీఆర్ మార్గ్ వద్ద ప్రత్యేకంగా అత్యంత శక్తివంతమైన లాంగ్-బూమ్ మెకానికల్ క్రేన్ నంబర్ 4 ను సిద్ధం చేశారు. విగ్రహం ఎత్తు దృష్ట్యా శోభాయాత్ర రూట్​లో ఎలాంటి అడ్డంకులు లేకుండా విద్యుత్ వైర్లను సరిచేసి, రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మలను ఇప్పటికే కత్తిరించారు.

ఖైరతాబాద్ గణేశుడి ఎత్తు 69 అడుగులు, వెడల్పు 28 అడుగులు కాగా.. విగ్రహం కదలకుండా నిశ్చలంగా ఉండేందుకు వెల్డర్ నాగబాబు ఆధ్వర్యంలో 20 మంది కార్మికులు శ్రమిస్తున్నారు. విగ్రహం అడుగుభాగంలో పటిష్టంగా ఉండేలా ఐరన్ స్తంభాలతో పక్కా బేస్‌‌‌‌ ఏర్పాటు చేస్తున్నారు. గురువారం అర్ధరాత్రి గణపతిని టస్కర్ పైకి ఎక్కిస్తారని, వెంటనే సపోర్టింగ్ వెల్డింగ్ పనులు పూర్తి చేస్తామని నిర్వాహకులు తెలిపారు.