రేపే గణేశ్​ నిమజ్జనం

రేపే గణేశ్​ నిమజ్జనం
  • ట్యాంక్​బండ్​పై ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి, మేయర్

హైదరాబాద్​, వెలుగు: ఆదివారం జరిగే గణేశ్​ నిమజ్జనానికి ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా, ట్యాంక్ బండ్, బేబీ పాండ్ల దగ్గర కలిపి మొత్తం 44 క్రేన్లను ఏర్పాటు చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ తెలిపారు. గణనాథులు వచ్చే శోభాయాత్ర మార్గాల్లో మరమ్మతులు, పారిశుధ్య పనుల కోసం ప్రత్యేక బృందాలను నియమించామన్నారు. ట్యాంక్​ బండ్​పై నిమజ్జన ఏర్పాట్లను మంత్రి తలసాని, మేయర్ గద్వాల్​ విజయలక్ష్మి శుక్రవారం పరిశీలించారు.  తర్వాత ట్యాంక్​ బండ్​పై ఏర్పాటు చేసిన పోలీస్ కంట్రోల్ రూంలో అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. నిమజ్జన మార్గాల్లో శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంచుతామని మంత్రి చెప్పారు.   162 గణేశ్​యాక్షన్ టీమ్స్​రెడీగా ఉన్నాయని, వీటిల్లో మొత్తం 8,116 మంది సిబ్బంది ఉన్నారని మేయర్  విజయలక్ష్మి చెప్పారు. ట్యాంక్ బండ్ లో 33, ఎన్టీఆర్ మార్గ్ లో 11 క్రేన్లను ఏర్పాటు చేశామన్నారు. గ్రేటర్​ వ్యాప్తంగా మొత్తం 33 చెరువులు, 25 ప్రత్యేక కొలనుల వద్ద 330 క్రేన్లు రెడీగా ఉన్నాయని చెప్పారు. నిమజ్జన వ్యర్థాలను తొలగించేందుకు ఎక్స్ లేటర్లు 20, జేసీబీ లు 21, మినీ టిప్పర్లు 39, 44 వాహనాలు (10 టన్నుల సామర్థ్యం ఉన్నవి) అందుబాటులో ఉంచామన్నారు. సరూర్ నగర్, ప్రగతి నగర్, కాప్రా చెరువుల్లో 3 బోట్ల చొప్పున ఉంచామని.. టూరిజం శాఖ ద్వారా ట్యాంక్ బండ్ లో 3 బోట్లు, నెక్లెస్ రోడ్ లో 2 బోట్లతో పాటు మరో 4 స్పీడ్ బోట్లు, 10 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచామన్నారు.

బాలాపూర్​ నుంచి ట్యాంక్​ బండ్​ దాకా భద్రత
బాలాపూర్​ నుంచి ట్యాంక్​ బండ్​దాకా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు.  25 వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారని పోలీసు అధికారులు తెలిపారు. ట్యాంక్​ బండ్, నెక్లెస్​ రోడ్, లోయర్​ ట్యాంక్​ బండ్ ప్రాంతాల్లో ఆదివారం, సోమవారం ట్రాఫిక్​ మళ్లించనున్నారు.