ఎమ్మెల్యే పదవిపై హైకోర్టు విధించిన అనర్హతపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్ కు నిరాశ ఎదురైంది. హైకోర్టు ప్రకటించిన అనర్హత తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. దానం నాగేందర్ పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టేసింది. అనర్హత పడిందని, మళ్లీ ఎన్నికలకు వెళ్లండని సుప్రీంకోర్టు దానం నాగేందర్ కు స్పష్టం చేసింది.
ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫామ్‌పై పోటీ చేశారు. దీంతో ఆయనపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్, బీజేపీ నేతలు అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ జరిపిన స్పీకర్.. దానం చట్టపరంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడలేదని మార్చి 11న తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు.
దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన హైకోర్టు సీజే బెంచ్.. కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయడంతో పాటు స్పీకర్ ఇచ్చిన నిర్ణయాన్ని పక్కనపెట్టింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసినప్పటి నుంచే అనర్హత అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
అలాగే ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు స్పీకర్, ఎన్నికల కమిషన్‌కు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సెప్టెంబర్ 19న సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై గురువారం విచారణ జరిపిన సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పును సమర్థించింది. దీంతో.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది.
