ఫ్యాన్సీ నంబర్లు .. రవాణా శాఖకు కాసుల పంట

  ఫ్యాన్సీ నంబర్లు ..  రవాణా శాఖకు కాసుల పంట

ఫ్యాన్సీ నంబర్లు రవాణా శాఖకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇవాళ ఒక్కరోజే ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయానికి ఫ్యాన్సీ నంబర్లతో రూ.అరకోటి వరకు ఆదాయం వచ్చింది.  ఏడుమంది యజమానులు ఈ వేలంలో పోటీపడి ఫ్యాన్సీ నంబర్లను కైవసం చేసుకున్నారు.  దీంతో ఒక్కరోజే రవాణాశాఖకు రూ.45,98,490 ఆదాయం చేకూరింది. 

అత్యధికంగా TS 09 GE 9999 నంబర్‌కు రూ. 17,35,000 ఆదాయం రాగా,   అత్యల్పంగా TS 09 GF 0007 నంబర్ కు రూ.1,01,999 ఆదాయం వచ్చింది.  ఫ్యాన్సీ నెంబర్లలో ఎక్కువ మంది ఇష్టపడే 9999.. ఈ  నెంబర్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు.   ఈ ఏడాది ఇప్పటివరకు అత్యధికంగా 9999 నెంబర్‌కు ఓ వ్యక్తి రూ. 21.6 లక్షలు చెల్లించాడు. 

ఇక దీనితో పాటుగా సింగిల్‌ డిజిట్‌, బాండ్‌స్టైల్‌ నెంబర్లు.. 0001, 0007, 0009లకూ డిమాండ్‌ ఉంటోంది.  వాస్తవంగా వాహనాన్ని రిజిస్ట్రేషన్‌ చేస్తే.. వరస క్రమంలో వచ్చే నెంబర్‌ ఏదో ఒకటి అలాట్ చేస్తారు.  అలా కాకుండా స్పెషల్ నెంబర్ల కోసం కొంతమంది ఆరాట పడుతుంటారు. దానికోసం డబ్బు వెచ్చించడానికి వెనకాడరు. అలాంటి వారి కోసమే రవాణా శాఖ సుమారు 20ఏళ్ల క్రితం ఫ్యాన్సీ నెంబర్లను తెరపైకి తీసుకొచ్చింది.