వెట్ ల్యాండ్ సంరక్షణకు పటిష్ట కార్యాచరణ : అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి

వెట్ ల్యాండ్  సంరక్షణకు  పటిష్ట కార్యాచరణ : అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి
  • ఖమ్మం అడిషనల్​ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి

ఖమ్మం, వెలుగు : చిత్తడి నేలల (వెట్ ల్యాండ్) సంరక్షణకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని, ఈ నోటిఫికేషన్ వల్ల భూమి యాజమాన్య హక్కులు మారవని ఖమ్మం అడిషనల్​ కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా వెట్ ల్యాండ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. చిత్తడి నేలల్లో నిర్మాణ వ్యర్థాలు వేయడం, భూ స్వభావాన్ని మార్చడం నిషేధమని, అయితే ఎఫ్ టీఎల్ పరిధిలోని పట్టా భూముల్లో వరద లేని సమయంలో వ్యవసాయానికి అనుమతి ఉంటుందని తెలిపారు. ఈ ప్రాంతాల్లో నివాస గృహాలు, పరిశ్రమల ఏర్పాటుకు అనుమతి ఉండదని, కేవలం పశువుల మేత, చేపల వేట లాంటి స్థానిక అవసరాలకు మాత్రమే పరిమితులకు లోబడి అవకాశం ఉంటుందని జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ వివరించారు.

మరోవైపు సంక్రాంతి పండుగ వేళ పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు కలిగించే సింథటిక్ మంజాను వాడకూడదని, కేవలం కాటన్ మంజానే వినియోగించాలని సూచించారు. ఇదే సందర్భంలో తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో తయారు చేసిన ఫ్లై గ్రీన్ పోస్టర్ ను ఆవిష్కరించారు. వెలుగుమట్ల అర్బన్ పార్కుకు కొత్త పేరు, ట్యాగ్ లైన్, లోగోను రూపొందించేందుకు పబ్లిక్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. జనవరి 10 నుండి 20 వరకు జరిగే ఈ పోటీలో అత్యుత్తమ పేరు, ట్యాగ్ లైన్ సూచించిన వారికి రూ.4 వేలు, అలాగే ఉత్తమ లోగో డిజైన్ చేసిన వారికి మరో రూ. 4 వేల నగదు బహుమతి అందజేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల ప్రజలు ఈ పోటీలో పాల్గొని తమ సృజనాత్మకతను చాటుకోవాలని ఆయన కోరారు.