దివ్యాంగ మహిళలతో షీరాక్స్ సెంటర్ల ఏర్పాటు :  ఖమ్మం కలెక్టర్​ ముజమ్మిల్​ ఖాన్​

దివ్యాంగ మహిళలతో షీరాక్స్ సెంటర్ల ఏర్పాటు :  ఖమ్మం కలెక్టర్​ ముజమ్మిల్​ ఖాన్​

ఖమ్మం టౌన్, వెలుగు :  ప్రతీ మండల కేంద్రంలో దివ్యాంగ మహిళలతో షీరాక్స్ సెంటర్ ఏర్పాటు చేస్తామని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. బుధవారం రఘునాథపాలెం మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా గార్లపాటి రమాబాయికి మంజూరైన  షీరాక్స్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలకు ఆర్థిక భద్రత కల్పిస్తూ, దివ్యాంగులకు ఉపాధి కల్పించేలా షీరాక్స్ పేరిట ప్రభుత్వ కార్యాలయాల వద్ద కంప్యూటర్ తో కూడిన జిరాక్స్ సెంటర్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.

సిటిజన్ సర్వీస్ సెంటర్, స్కానింగ్, నామినేషన్ లాంటి సౌకర్యాలతో భవిష్యత్​లో విస్తరణకు కూడా అవకాశం ఉంటుందన్నారు. అనంతరం దశలవారీగా మహిళలకు క్రౌడ్​ అధికంగా ఉండే ప్రాంతాల్లో షీ రాక్స్ సెంటర్లను కేటాయిస్తామని తెలిపారు. అనంతరం ‘మా పాప  మా ఇంటి మణిదీపం’ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం నగరం 51వ డివిజన్ ద్వారకనగర్ లో బేగం కుటుంబ సభ్యులు, అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు అందంగా ఇంటిని ఆలంకరించి ‘ఆడపిల్లలను పుట్టనిద్దాం.. ఆడపిల్లలను పెరగనిద్దాం’ అనే నినాదాలతో ముగ్గులు వేసి కలెక్టర్ కు ఘన స్వాగతం పలికారు.   

లాభసాటి పంటలు సాగు చేయాలి

రైతులు లాభసాటి పంటలు సాగు చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. బుధవారం ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం మండలాల్లో  ఆయన పర్యటించారు. బల్లేపల్లి లోని కుర్ర మహేశ్ కు చెందిన పామాయిల్ పంటను పరిశీలించారు. పొలం గట్టు వద్ద రైతులతో కూర్చొని సమస్యలపై ఆరా తీశారు. జిల్లాలో లాభదాయక ఆయిల్ పామ్ పంటను అధిక సంఖ్యలో  రైతులు సాగు చేయాలని, దానికి జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని చెప్పారు.

ఆయిల్ పామ్ పంట సాగు వల్ల చాలా లాభాలు ఉంటాయని, అంతర్ పంటల ద్వారా మొదటి మూడేండ్లు ఆదాయం వస్తుందని తెలిపారు. ఆయిల్ పామ్ పంట దిగుబడి ప్రారంభమైన తర్వాత ఏడాదికి లక్షకు తగ్గకుండా సంపాదిస్తారని చెప్పారు. ప్రభుత్వం మొక్కల సబ్సిడీ, డ్రిప్ ఇరిగేషన్ సదుపాయ కల్పనకు సబ్సిడీ,  మొదటి నాలుగు సంవత్సరాల వరకు అంతర్ పంట పెట్టుబడులకు సబ్సిడీని అందిస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో  జిల్లా ఉద్యానవన అధికారి ఎం.వి. మధుసూదన్, హెచ్​వో నగేశ్, రఘునాథపాలెం ఎవో కిషోర్ బాబు, ఆగ్రో వెట్ లిమిటెడ్ మేనేజర్ ఏ. రామకృష్ణ పాల్గొన్నారు.