
- ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ఖాన్
- జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి తనిఖీ
ఖమ్మం టౌన్, వెలుగు : ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సేవలపై పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. దవాఖానకు వచ్చే వాహనాల పార్కింగ్, హాస్పిటల్ గేట్ బయట వాహనాల రద్దీ నియంత్రణపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆస్పత్రికి కావాల్సిన వైద్య పరికరాలు, సౌకర్యాల గురించి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు.
పేషెంట్లకు భోజనం రుచికరంగా ఉండాలని చెప్పారు. పారిశుధ్య నిర్వహణ పక్కాగా ఉండాలని అధికారులను ఆదేశించారు. టాయిలెట్ రిపేర్లు పూర్తి చేయాలన్నారు. ఆస్పత్రిలోని క్రిటికల్ కేర్, పరిపాలన భవనాల వైపు సీసీ రోడ్ల నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు. పేషెంట్లకు ఇబ్బంది లేకుండా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. ఆస్పత్రికి 10 ఏసీలు, రేడియాలజీ పోస్టులు వెంటనే భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ ను ఆదేశించారు. ఆస్పత్రి నుంచి రోడ్డు అవతలకు మెడికల్ కళాశాలకు ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపట్టాలన్నారు. అడిషనల్ కలెక్టర్ శ్రీజ, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్ కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్. బి.కిరణ్, ఆర్ఎంవో డాక్టర్ రాథోడ్, గ్రేడ్ 2 నర్సింగ్ సూపరింటెండెంట్ జి. పార్వతమ్మ ఉన్నారు.
‘గణతంత్ర’ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు
గణతంత్ర దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్ లో అడిషనల్కలెక్టర్ శ్రీజ, ఇతర అధికారులతో కలిసి ఆయన ఏర్పాట్లపై సమీక్షించారు. కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారని తెలిపారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో కలెక్టర్ ముఖ్య అతిథిగా నిర్వహించే జిల్లా స్థాయి వేడుకలో జాతీయ సమైక్యతను తెలియజేస్తూ 3 కల్చరల్ ప్రోగ్రామ్లను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ అధికారికి సూచించారు.
కొత్తగా ప్రారంభమయ్యే పథకాలకు సంబంధించి స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బంది ప్రశంసా పత్రాలు అందజేసేందుకు ప్రతిపాదనలు పంపాలని, ఈ జాబితాలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది పేర్లు కూడా పంపాలని చెప్పారు. వరదల సమయంలో బాగా పని చేసిన సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందేలా చూడాలన్నారు. స్వాతంత్ర్య సమరయోధులకు వాహనాలు ఏర్పాటు చేసి వేడుకలలో పాల్గొనేలా చూడాలని సూచించారు.