చింతకాని, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోందని ఖమ్మం కలెక్టర్ దివాకర తెలిపారు. మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం జగన్నాథపురం (మత్కెపల్లి) వద్ద నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను సోమవారం కలెక్టర్ పరిశీలించారు. పోలీసు కమిషనర్ సునీల్ దత్, అడిషనల్ కలెక్టర్లు పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి సభా వేదిక, హెలిప్యాడ్, వాహనాల పార్కింగ్, ప్రజల రాకపోకల మార్గాలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.
జూన్ 30న నిర్వహించాల్సిన రైతు భరోసా ప్రారంభోత్సవ సభను భారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరికల కారణంగా వాయిదా వేసిన విషయం గుర్తుచేశారు. వాతావరణ పరిస్థితులు మెరుగుపడిన నేపథ్యంలో సభా ప్రాంగణాన్ని పరిశీలించగా ప్రస్తుతం కార్యక్రమం నిర్వహించేందుకు అనుకూలంగా ఉందని తెలిపారు. ప్రాంగణ పరిస్థితులు, జిల్లా యంత్రాంగం చేసిన ఏర్పాట్లపై సీఎం కార్యాలయం, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శికి నివేదిక పంపనున్నట్లు వెల్లడించారు. పర్యటన తేదీని ప్రభుత్వం త్వరలో అధికారికంగా ప్రకటిస్తుందని, అప్పటి వరకు అన్ని శాఖలు పూర్తి సన్నద్ధతతో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.
