జంక్షన్ల వద్ద ప్రమాదాల నియంత్రణకు చర్యలు : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

 జంక్షన్ల వద్ద ప్రమాదాల నియంత్రణకు చర్యలు : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
  • ఖమ్మం కలెక్టర్ అనుదీప్​ దురిశెట్టి
  • రోడ్డు భద్రత కమిటీ చర్యల పురోగతిపై సమీక్ష 

ఖమ్మం టౌన్, వెలుగు :  జిల్లాలో ప్రమాదాలు అధికంగా జరిగే 30 జంక్షన్ల వద్ద యాక్సిడెంట్ల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్ లో రోడ్డు భద్రత కమిటీ చేపట్టిన చర్యల పురోగతిపై సమీక్షించారు.జిల్లాలో  30 జంక్షన్ లలో 50 శాతం పైగా ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించామని, అక్కడ రోడ్డు భద్రతా ప్రమాణాలు చేపడితే ప్రమాదాలు నియంత్రించవచ్చని చెప్పారు.

రంబుల్ స్ట్రీప్స్, లేన్ మార్కింగ్​, ఆక్రమణల తొలగింపు, జీబ్రా క్రాసింగ్, సైన్ బోర్డ్స్, బ్లింకర్స్ ఏర్పాటు లాంటి పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డీఆర్ఓ ఏ. పద్మశ్రీ, నేషనల్ హైవే ఈఈ యుగంధర్, పీడీ దివ్య, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

మైనార్టీ గురుకులాల ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలి.. 

ఖమ్మం జిల్లా మైనార్టీ గురుకుల పాఠశాలల ప్రవేశాల కోసం, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో చేరాలనుకునే వారు వెంటనే ఆన్​లోన్​లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ  ఆధ్వర్యంలో 2026–-27 విద్యా సంవత్సరానికి గాను మైనారిటీ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లకు సంబంధించిన పోస్టర్‌ను కలెక్టరేట్ లో మంగళవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో గురుకుల విద్యాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.

వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇంటర్మీడియట్ తో పాటు, 6, 7, 8 తరగతుల్లో ఉన్న బ్యాక్‌ లాగ్ ఖాళీలను కూడా భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎండీ  ముజాహిద్, తెలంగాణ మైనారిటీ విద్యాసంస్థల ప్రాంతీయ కో ఆర్డినేటర్ ఎంజె అరుణ కుమారి, గురుకుల పాఠశాలల, కళాశాలల ప్రిన్సిపాల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.