ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: పోరాడి సాధించుకున్న తెలంగాణలో విద్యావ్యవస్థ విధ్వంసానికి గురైందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​గౌడ్​ ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ విద్యార్థుల, యువజనుల పోరుయాత్రలో భాగంగా కొత్తగూడెంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యా, వైద్యాన్ని జాతీయం చేయాలని డిమాండ్​ చేశారు. తెలంగాణ రాష్ట్రం దగా కోరులైన కుటుంబ సభ్యుల పాలనలో బందీ అయిందన్నారు. ఫీజు రీయింబర్స్​మెంట్​ లేక యాజమాన్యాల వేధింపులు భరించలేక ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గురుకులాలు, హాస్టళ్లలో విద్యార్థులు పురుగుల అన్నం తింటున్నారని చెప్పారు. చట్ట సభలతో పాటు అన్నిరంగాల్లో బీసీలు ఉనికిని చాటాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ సంఘాల నాయకులు అంకినేడు ప్రసాద్, కె శ్రీనివాస్​, కె శ్యాం, శ్రీనివాస్, వెంకన్న పాల్గొన్నారు. 

స్కిల్స్​ పెంచేందుకే సైన్స్​ ఫేర్​లు

ఖమ్మం టౌన్, వెలుగు: విద్యార్థుల్లో స్కిల్స్​ పెంచేందుకే సైన్స్​ ఫేర్​లు దోహదం చేస్తాయని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  అన్నారు. సిటీలోని సెయింట్  జోసెఫ్  స్కూల్ లో విద్యా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆవిష్కరణలు ప్రజల సమస్యలు, అవసరాలు తీర్చేవిగా ఉండాలని సూచించారు. ఇలాంటి ప్రదర్శనలతో విద్యార్థులకు గుర్తింపు వస్తుందని చెప్పారు. కొత్త అంశాలపై ప్రయోగాలు చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. అనంతరం స్టూడెంట్స్  రూపొందించిన 478 ప్రదర్శనలను పరిశీలించి విద్యార్థులను అభినందించారు. మేయర్ పునుకొల్లు నీరజ, కలెక్టర్  వీపీ గౌతమ్, జడ్పీ చైర్మన్  లింగాల కమల్ రాజ్, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఇన్​చార్జి డీఈవో సత్యనారాయణ పాల్గొన్నారు.

రెసిడెన్షియల్  డిగ్రీ కాలేజీ ప్రారంభం

రఘునాథపాలెం మండల కేంద్రంలోని ఎస్ఎన్ మూర్తి పాలిటెక్నిక్  ఆవరణలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రైవేట్​ విద్యకు దీటుగా గురుకులాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం నాణ్యమైన విద్య అందిస్తుందని తెలిపారు. అనంతరం కొటపాడు గ్రామంలో రూ.48 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, బీసీ వెల్ఫేర్​ ఆఫీసర్​ జ్యోతి, ఎంపీపీ గౌరి, జడ్పీటీసీ ప్రియాంక పాల్గొన్నారు.

కల్యాణలక్ష్మి చెక్కులు అందజేత

ఖమ్మం కార్పొరేషన్: మంత్రి క్యాంప్​ ఆఫీస్​లో 50 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, 48 మందికి సీఎంఆర్ఎఫ్​ కింద మంజూరైన రూ.68.84 లక్షల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ పథకాలతో పేదింటి ఆడబిడ్డలకు భరోసాను ఇస్తున్నామని తెలిపారు. ఏఎంసీ చైర్మన్​ ప్రసన్నలక్ష్మి, తహసీల్దార్లు శైలజ, నర్సింహారావు పాల్గొన్నారు.

రైల్వే స్టేషన్ ను తనిఖీ చేసిన డీఆర్ఎం

మధిర, వెలుగు: సికింద్రాబాద్ రైల్వే డివిజనల్  మేనేజర్(డీఆర్ఎం) అజయ్ కుమార్ మంగళవారం మధిర రైల్వే స్టేషన్​ను తనిఖీ చేశారు. విజయవాడ నుంచి ప్రత్యేక రైలులో వచ్చిన ఆయన కొత్తగా ఏర్పాటు చేసిన ఫుట్ బాల్ కోర్టు, చిల్డ్రన్స్ పార్క్ ను ప్రారంభించి మొక్కలు నాటారు. అనంతరం రైల్వే స్టేషన్​ పరిసరాలు పరిశీలించి ఫుట్ ఓవర్ బ్రిడ్జి దిగే దగ్గర ఎత్తుగా ఉండడాన్ని గమనించారు. దీనిని సరి చేయాలని సూచించారు. డీఆర్ఎంకు కాంగ్రెస్,  టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, మధిర సేవాసమితి, వాసవి క్లబ్, స్విమ్మర్స్ అసోసియేషన్, రైల్వే ప్రయాణికుల సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రాలను అందజేశారు . నవజీవన్  రైలును ఆపాలని, పద్మావతి ఎక్స్ ప్రెస్ ను తిరుగు ప్రయాణంలో హాల్ట్​ ఇవ్వాలని కోరారు. ఉదయం విజయవాడ వెళ్లేందుకు ప్యాసింజర్  రైలును పునరుద్ధరించాలని, లక్నో ఎక్స్ ప్రెస్  రైలును మధిరలో ఆపాలని అన్నారు. రైల్వే ఎస్పీ డి చటోపాధ్యాయ, ఏడీఈఎన్  అరుణ్ కుమార్ శర్మ , ఐఓడబ్ల్యూ శ్రీనివాసరావు,  సీనియర్  డీఈఎన్  కృష్ణారెడ్డి, ప్రసాద్ రావు, మిరియాల వెంకట రమణ గుప్తా, బెజవాడ రవిబాబు, జంగా నర్సిరెడ్డి,  ఇరుకుళ్ల లక్ష్మీనర్సింహారావు, జేవీరెడ్డి, శీలం నరసింహారావు, మిరియాల కాశీ విశ్వేశ్వరరావు, చల్లా సత్యం పాల్గొన్నారు.

బాలాజీ కుటుంబానికి పరామర్శ

ఇల్లందు(టేకులపల్లి), వెలుగు: హత్యకు గురైన అశోక్​ కుటుంబాన్ని మంగళవారం పలువురు పరామర్శించారు. అశోక్​ తండ్రి అయిన టేకులపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు ధారవత్​ బాలాజీని తీన్మార్​ మల్లన్న, జడ్పీ​చైర్మన్​ కోరం కనకయ్య, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సెంట్రల్​ టోబాకో బోర్డు సభ్యుడు బైరెడ్డి ప్రభాకర్​రెడ్డి  తదితరులు పరామర్శించి ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కేసును హైదరాబాద్​కు బదిలీ చేసి సమగ్ర విచారణ జరిపించాలని తీర్మాన్​ మల్లన్న కోరారు.

ఫోన్​లో బండి పరామర్శ..

బాలాజీని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ మంగళవారం ఫోన్​లో పరామర్శించారు. హత్యకు సంబంధించిన వివరాలు, కేసు విచారణ తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. 

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి

ఇల్లందు,వెలుగు: పంట దిగుబడులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ-, అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో రైతులు ఇల్లందు ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఆవునూరి మధు మాట్లాడుతూ దొడ్డు వడ్లను కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు ఎట్టి నర్సింహారావు, మోకాళ్ల కృష్ణ, బానోత్​ సంతు, కొక్కు సారంగపాణి, తోడేటి నాగేశ్వరరావు, గౌని నాగేశ్వరరావు పాల్గొన్నారు.