ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఖమ్మం, వెలుగు: ఖమ్మం - సూర్యాపేట హైవే పనులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. ఇప్పటికే కాంట్రాక్టర్​కు పలుమార్లు గడువు పెంచినా, పనులు ఆలస్యమవుతున్నాయి. నేషనల్​ హైవే అధికారులు ఇచ్చిన ఫైనల్ గడువు ప్రకారం డిసెంబర్​ 22లోగా 100 శాతం పనులు పూర్తి చేయాల్సి ఉన్నా, సంక్రాంతి వరకు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. మొదటగా నిర్ణయించిన ప్రకారం గతేడాదితో పనులు కంప్లీట్ కావాల్సి ఉన్నా, కరోనా కారణంగా ఆలస్యమయ్యాయి. ఆ తర్వాత ఈ ఏడాది జూన్, సెప్టెంబర్​ అంటూ గడువు పెంచుతూ పోయారు. 90 శాతానికి పైగా పనులు కావడంతో సెప్టెంబర్​ 28న ప్రొవిజనల్​ సర్టిఫికెట్  ఆఫ్  కంప్లీషన్​ జారీ చేశారు. దీంతో అక్టోబర్​ 21 నుంచి మోతె మండలం సింగరేణిపల్లి దగ్గర టోల్  గేట్​ ఏర్పాటు చేసి ఫీజు వసూళ్లు కూడా ప్రారంభించారు. అప్పుడే ఆఫీసర్లు మరో మూడు నెలలు గడువు ఇవ్వగా, ఈనెల 22తో గడువు కూడా ముగుస్తోంది. 

పనులు కంప్లీట్​ చేస్తలేరు..

ఖమ్మం - సూర్యాపేట హైవేపై 58.626  కిలోమీటర్లకు గాను, 54.536 కిలోమీటర్ల పని పూర్తయింది. తల్లంపాడు, అగ్రహారం, రాఘవాపురం సమీపంలో  మూడు బ్రిడ్జిల కనెక్టివిటితో కలిపి 4.09 కిలోమీటర్ల వర్క్స్​ మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. మూడు చోట్ల ప్రస్తుతం వాహనదారులు సర్వీస్​ రోడ్డునే ఉపయోగించాల్సి వస్తోంది. తల్లంపాడు, రాఘవాపురం బ్రిడ్జీలు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యేందుకు కనీసం మరో నెల పడుతుందని అంటున్నారు. అధికారులు మాత్రం పనులు ఆలస్యమవుతున్న ప్రతిసారీ గడువు పెంచి కాంట్రాక్టర్​కు సహకరిస్తున్నారనే విమర్శలున్నాయి. కాంట్రాక్టర్​పై ఎలాంటి యాక్షన్​ తీసుకోకపోవడంతోనే పనులు ఆలస్యమవుతున్నాయని అంటున్నారు. ఈ సారైనా సీరియస్​గా చర్యలు తీసుకుంటారా, లేక మళ్లీ కొద్ది రోజులు గడువు పొడిగిస్తారా అనేది మరో ఐదు రోజుల్లో తెలుస్తుంది.

కాంట్రాక్టర్​పై చర్యలు​తీసుకుంటాం

హైవే మేజర్​ పనులు కంప్లీట్ అయ్యాయి. మూడు చోట్ల కొంచెం వర్క్ మాత్రమే పెండింగ్ ఉంది. ఇచ్చిన గడువులోగా కాంట్రాక్టర్​ పనులు కంప్లీట్ చేయకపోతే, యాక్షన్​ తీసుకుంటాం. వర్క్​ ఆలస్యం చేసినందుకు కాంట్రాక్టర్ పై పెనాల్టీ వేసే అవకాశం కూడా ఉంటుంది.  - దుర్గాప్రసాద్​, ఎన్​హెచ్​ఏఐ పీడీ

ఎర్రజెండాతోనే ఆత్మగౌరవం

ముదిగొండ, వెలుగు: సీపీఎంలో  ప్రతి కార్యకర్తకు విలువ, స్వేచ్ఛ, ఆత్మగౌరవం ఉంటుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మండలంలోని అమ్మపేటలో ఊటుకురి గోపయ్య ఆధ్వర్యంలో పలువురు శనివారం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాత్కాలిక ఇబ్బందులు వచ్చినా భవిష్యత్​ ప్రత్యామ్నాయం కమ్యూనిస్టులదేనన్నారు. రాష్ట్రంలో గెలుపోటములను నిర్ణయించేది కమ్యూనిస్టులేనని తెలిపారు. ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు ఖమ్మంలో జరిగే వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడో మహాసభలను సక్సెస్​ చేయాలన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర్ రావు, బండి రమేశ్, వాసిరెడ్డి వర ప్రసాద్, బట్టు పురుషోత్తం, ఇరుకు నాగేశ్వర్ రావు, వేల్పుల భద్రయ్య, కల్యాణ్, మండారపు పద్మ, వెంకయ్య, పయ్యావుల ప్రభావతి, యండ్రపల్లి రవి, బెజవాడ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఖమ్మం టౌన్: పేదల కోసమే ఎర్రజెండా పుట్టిందని తమ్మినేని వీరభద్రం అన్నారు. సిటీలోని త్రీ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో పార్టీ జనరల్ బాడీ సమావేశం పత్తిపాక నాగసులోచన అధ్యక్షతన జరిగింది. పేద ప్రజల సమస్యలపై సీపీఎం పోరాడుతుందని తెలిపారు. ఎర్ర శ్రీకాంత్, వై విక్రం, ఎర్ర శ్రీనివాసరావు, భుక్యా శ్రీనివాసరావు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులు పూర్తయ్యేలా చూడండి

వైరా, వెలుగు : నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది పునులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్​ వీసీ గౌతమ్​ను స్థానిక ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్​ కోరారు. శనివారం కలెక్టర్​ ఆఫీసులో ఆయనను కలిసి వైరా రింగ్​ రోడ్ సెంటర్  నుంచి మధిర, బోనకల్  రోడ్డు  రిపేర్లు చేయాలని, కొణిజర్ల, -చింతకాని రోడ్డు పనులు త్వరగా పూర్తి చేసేలా చూడాలన్నారు. నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి చేసి లబ్ధిదారులకి అందించేలా కృషి చేయాలని కోరారు. వెజ్,- నాన్ వెజ్ మార్కెట్, గిరిజన భవన్, షాదీఖానా పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. సానుకూలంగా  స్పందించిన కలెక్టర్​ పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 

కేసీఆర్​ను విమర్శిస్తే సహించేది లేదు : ఎమ్మెల్సీ తాతా మధుసూదన్

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్​ను విమర్శిస్తే సహించేది లేదని బీఆర్ఎస్​ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూధన్​ హెచ్చరించారు. శనివారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్​టీపీ అధినేత షర్మిల భాష తీరు మార్చుకోకపోతే నర్సంపేట ఘటన పునరావృతం అవుతుందని తెలిపారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో, పాలేరులో షర్మిల అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నేను పులి బిడ్డను అని షర్మిల చెబుతున్నారని అన్నారు. వైఎస్సార్​ రక్తం మరిగిన పులి అని, చర్చల పేరుతో అనేక మందిని చంపించారని ఆరోపించారు. రూ.75 కోట్లతో భక్త రామదాసు ప్రాజెక్ట్​ నిర్మించి పాలేరును కేసీఆర్​ సస్యశ్యామలం చేశారని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు నీ తండ్రి వైఎస్సార్, అన్న జగన్​ అడ్డుపడలేదా అని ప్రశ్నించారు. బీజెపీతో కుమ్మక్కై తెలంగాణపై ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారని విమర్శించారు. జడ్పీ చైర్మన్​ లింగాల కమల్​రాజు, ఉద్యమకారుడు ఉప్పల వెంకటరమణ మాట్లాడుతూ షర్మిలకు తెలంగాణలో తిరిగే నైతిక హక్కు లేదన్నారు. డీసీసీబీ చైర్మన్​ కూరాకుల నాగభూషణం, నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, బెల్లం వేణు, చింతనిప్పు కృష్ణచైతన్య, సుబ్బారావు, శేషగిరిరావు, నరేందర్​ పాల్గొన్నారు.

సీతారాములకు సువర్ణ తులసీదళార్చన

భద్రాచలం, వెలుగు : సీతారాములకు శనివారం సువర్ణ తులసీ దళాలతో అర్చన నిర్వహించారు. రామపాదుకలకు భద్రుని మండపంలో పంచామృతాలతో అభిషేకం చేశారు. ముందుగా గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చారు. సుప్రభాత సేవ చేశాక రామపాదుకలను భద్రుని మండపానికి తీసుకెళ్లారు. ధనుర్మాసోత్సవంలో భాగంగా గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తిరుప్పావై ప్రవచనంలో భాగంగా రెండో పాశురాన్ని వివరించారు. అనంతరం గోదాదేవికి సూర్యప్రభ వాహనంపై తిరువీధి సేవ చేశారు. రామాలయం నుంచి తాతాగుడి సెంటర్​ వరకు జరిగిన ఈ సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తిరిగి ఆలయానికి వచ్చాక సీతారాముల కల్యాణమూర్తులను ప్రాకార మండపానికి తీసుకొచ్చి నిత్య కల్యాణం జరిపించారు.