ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఖమ్మం టౌన్, వెలుగు: అంకిత భావంతో ప్రజలకు సేవలందిస్తున్న టీఆర్ఎస్ ​ప్రభుత్వానికి మరోసారి అవకాశం కల్పించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రఘునాథపాలెంలో పోలీస్ స్టేషన్ భవనం, తహసీల్దార్  ఆఫీస్​ నిర్మాణ పనులకు ఎంపీలు నామా నాగేశవరరావు, వద్దిరాజు రవిచంద్ర, కలెక్టర్  వీపీ గౌతమ్, పోలీస్ కమిషనర్  విష్ణు ఎస్  వారియర్ లతో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంపీ ల్యాడ్స్  నుంచి ఎంపీలు రూ.25 లక్షల చొప్పున మంజూరు చేయడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి సీడీపీ నిధులన్నీ మండలానికి కేటాయించినట్లు తెలిపారు. సీపీ విష్ణు ఎస్  వారియర్, అడిషనల్​ కలెక్టర్ మధుసూదన్, డీసీసీబీ చైర్మన్  కూరాకుల నాగభూషణం, రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ ప్రియాంక, ఎంపీపీ మాలోత్ గౌరి, వైస్ ఎంపీపీ గుత్తా రవి, సర్పంచ్ గుడిపూడి శారద, ఎంపీడీవో రామకృష్ణ, తహసీల్దార్  నరసింహారావు పాల్గొన్నారు.

రామయ్యకు ముత్తంగి సేవ

భద్రాచలం,వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామికి సోమవారం ముత్తంగి సేవ నిర్వహించారు. గర్భగుడిలో ఉదయం సుప్రభాత సేవ అనంతరం బాలబోగం నివేదించాక మూలవరులు, ఉత్సవమూర్తులు, లక్ష్మీతాయారు అమ్మవారు, ఆంజనేయస్వామికి ముత్యాలు పొదిగిన వస్త్రాలను అలంకరించి ముత్తంగి సేవ చేశారు. తర్వాత కల్యాణమూర్తులను ప్రాకార మండపానికి తీసుకెళ్లి నిత్య కల్యాణం జరిపించారు. భక్తులు కంకణాలు ధరించి స్వామి కల్యాణంలో పాల్గొన్నారు. మాధ్యాహ్నిక ఆరాధన తర్వాత రాజబోగం నివేదించారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది.

108 వెహికల్​లో డెలివరీ

గుండాల, వెలుగు: ఆళ్లపల్లి మండలం అనంతొగు గ్రామానికి చెందిన గలిగే శ్రావణి పురుడు పోసుకుంది. 108లో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఈఎంటీ సరోజిని డెలివరీ చేశారు. శ్రావణి మగ బిడ్డకు జన్మనివ్వగా, తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. అనంతరం వారిని ఆళ్లపల్లి సర్కార్ ఆసుపత్రికి తరలించారు. ఈఎంటీ సరోజిని, పైలెట్ సునీల్ కు కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

‘డబుల్’ ఇండ్లలో వసతులు కల్పించాలి

చండ్రుగొండ,వెలుగు: మండలకేంద్రంలో నిర్మించిన 30 డబుల్ బెడ్రూమ్​ ఇండ్లలో వసతులు కల్పించాలని డిమాండ్​ చేస్తూ సోమవారం తహసీల్దార్​ ఆఫీసు ముందు లబ్ధిదారులు ఆందోళన చేశారు. డ్రైనేజీలు నిర్మించాలని, స్లాబ్ లు కురవకుండా చూడాలని, బాత్రూమ్​లకు డోర్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 

జింకలతాండాలో కాంగ్రెస్​ పాదయాత్ర

ఖమ్మం టౌన్, వెలుగు: రఘునాథపాలెం మండలం జింకలతండాలో కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షుడు జావీద్ ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ జోడో గ్రామయాత్రను డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్  జెండా ఊపి ప్రారంభించారు. గ్రీన్ కాలనీ ప్రజల సమస్యలు తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కార్పొరేటర్లు మలీద్ వెంకటేశ్వర్లు, మహిళా కాంగ్రెస్  అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, రవి, కరుణాకర్ రెడ్డి, శంకర్ నాయక్, శ్రీశైలం యాదవ్, శంకర్, గౌస్, స్వరూప, రజియా పాల్గొన్నారు.

బెటాలియన్ ను తనిఖీ చేసిన డీఐజీ

సత్తుపల్లి, వెలుగు: 15వ బెటాలియన్ ను టీఎస్ఎస్పీ డీఐజీ సిద్ధిఖీ సోమవారం తనిఖీ చేశారు. గంగారంలోని గిరిజన బెటాలియన్ ను వార్షిక తనిఖీలో భాగంగా ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బెటాలియన్ కమాండెంట్ ఎస్​డీ జమీల్ బాషాతో కలిసి పలు విభాగాల పనితీరును పర్యవేక్షించారు. అదనపు కమాండెంట్ ఏ అంజయ్య, అసిస్టెంట్​ కమాండెంట్లు ఎం ఉదయ్ భాస్కర్ రావు, ఆర్  నాగేశ్వర రావు, ఎం శ్రీనివాసరావు 
పాల్గొన్నారు.

కిన్నెరసాని ప్రాజెక్ట్​ నీటి విడుదల

పాల్వంచ,వెలుగు: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లాలో వాగులు, చెరువులు, కుంటలు నిండి ప్రవహిస్తున్నాయి. మండలంలోని కిన్నెరసాని రిజర్వాయర్ కు వరద నీరు పోటెత్తింది. దీంతో అధికారులు సోమవారం రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. 407 అడుగుల నీటి సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలోకి  8 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. కిన్నెరసాని పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రైతులను ఆదుకోవాలని ధర్నా

తల్లాడ, వెలుగు: కల్తీ మిరప విత్తనాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బీజేపీ మండల అధ్యక్షుడు ఆపతి వెంకట రామారావు డిమాండ్​ చేశారు. సోమవారం తహసీల్దార్ ఆఫీస్ ఎదుట రైతులతో కలిసి ధర్నా చేశారు. తహసీల్దార్, అగ్రికల్చర్​ ఆఫీస్ లలో మెమోరాండం అందజేసి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. నకిలీ విత్తనాలతో నర్సరీలు నిర్వహిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ నియోజకవర్గ ఇన్​చార్జి  వీరంరాజు, గాదె కృష్ణారావు, రైతులు అంజిరెడ్డి, తిరుమల, కోటిరెడ్డి, రామిరెడ్డి, లాల్ సాహెబ్  పాల్గొన్నారు.  

నూకలంపాడు సర్పంచ్ కు మంత్రి సన్మానం

ఖమ్మం టౌన్, వెలుగు: స్వచ్ఛ భారత్ మిషన్  ఓడీఎఫ్  ప్లస్  జాతీయ షార్ట్  ఫిలిం కాంపిటీషన్ లో సెకండ్​ ప్లేస్​లో నిలిచిన ఏన్కూరు మండలం నూకలంపాడు సర్పంచ్​ ఇంజం శేషగిరిని మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ సన్మానించారు. సోమవారం మంత్రితో పాటు ఎంపీ నామా నాగేశ్వరరావు, కలెక్టర్  వీపీ గౌతమ్, అడిషనల్ కలెక్టర్  స్నేహలత మొగిలిని సర్పంచ్​కలిశాడు. ఈ సందర్భంగా సర్పంచ్​కు మంత్రి శాలువా కప్పి మెమోంటోను అందజేసి సత్కరించారు. జడ్పీ సీఈవో వీవీ అప్పారావు, డీఆర్డీవో ఎం విద్యా చందన, డీపీవో శ్రీహరి ప్రసాద్, జిల్లా స్వచ్ఛభారత్  కన్సల్టెంట్  నెల్లూరి అనూప్, జక్రియా పాల్గొన్నారు.

హైవేకు లింకు రోడ్డు నిర్మించాలి

కూసుమంచి, వెలుగు: హైవేకు లింకు రోడ్డు నిర్మించాలని మండలంలోని పలు గ్రామాల ప్రజలు సోమవారం హైవేపై రాస్తారోకో చేపట్టారు.మండలంలోని మల్లాయిగూడెం, హట్యాతండా, రాజుతండా, ఒంటిగుడిసెతండా, చాంఫ్లాతండా, గోరాలపాడుతండా, తాళ్లగడ్డతండా, బండమీదితండాలు వెళ్లేందుకు ఇరుకు అండర్​ బ్రిడ్జి నిర్మించడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు. రాస్తారోకోతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. 

ఇంటి పన్ను కడితేనే పోడు సర్వే

అన్నపురెడ్డిపల్లి, వెలుగు: ఇంటి పన్ను కడితేనే పోడు సర్వే చేస్తామనడంతో మండలంలోని అబ్బుగూడెం గ్రామంలో పోడుదారులు పంచాయతీ కార్యదర్శితో వాగ్వాదానికి దిగారు. ఇంటి పన్ను చెల్లిస్తేనే సర్వే చేస్తామని సెక్రటరీ శాంతి స్పష్టం చేయడంతో పోడుదారులు వాగ్వాదానికి దిగారు. ఇంటి పన్నుకు సర్వేకు సంబంధం ఏమిటని నిలదీశారు. ఫారెస్ట్​ ఆఫీసర్లు ప్లాంటేషన్​ ఉందని అభ్యంతరం చెప్పడంతో సర్వే నిలిచిపోయింది.

దొంగతనం కేసులో జైలు శిక్ష

ఇల్లందు, వెలుగు : దొంగతనం కేసులో ఒకరికి మూడు నెలల జైలు శిక్ష విదిస్తూ ఇల్లందు అదనపు జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి జె.ముఖేశ్​ సోమవారం తీర్పునిచ్చారు. మండలంలోని బొంబాయితండాకు చెందిన భుక్యా సుమన్ అదే గ్రామానికి చెందిన భుక్యా సురేశ్​ ఇంట్లో 2018 జూలై 24న దొంగతనం చేసినట్లు  కొమరారం పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. నిందితుడిపై నేరం రుజువు కావడంతో ఈ మేరకు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. 

తహసీల్దార్​ ఆఫీసులకు తాళాలు

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వీఆర్ఏలు తహసీల్దార్​ కార్యాలయాలకు తాళాలు వేసి నిరసన తెలిపారు. ఆఫీసర్లను వెళ్లకుండా అడ్డుకొని తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేలా చూడాలని వినతి పత్రాన్ని అందచేశారు. 78 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. - వెలుగు, నెట్​వర్క్

న్యాయవాదుల విధుల బహిష్కరణ

మధిర, వెలుగు : మధిర కోర్టు భవనాలకు రీపేర్లు చేసి వినియోగంలోకి తేవాలని డిమాండ్​ చేస్తూ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బొజెడ్ల పుల్లారావు ఆధ్వర్యంలో న్యాయవాదులు సోమవారం విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. కోర్టు మరమ్మతులు పూర్తయ్యేంత వరకు నిరవధికంగా విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. పాత భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో ఏడాది కాలంగా వెటర్నరీ డిపార్ట్​మెంట్​ భవనాల్లో రెండు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు పని చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెటర్నరీ డిపార్ట్‌మెంట్  బిల్డింగ్​లు సరిపోవడం లేదని, వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్​ చేశారు.