పత్తి, వరి పంట దిగుబడి తగ్గుతుందని ఖమ్మం రైతుల ఆందోళన

పత్తి, వరి పంట దిగుబడి తగ్గుతుందని ఖమ్మం రైతుల ఆందోళన

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు, తెగుళ్లతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. అతివృష్ఠి, అనావృష్ఠికి తోడు తెగుళ్లు, పురుగులు పెరగడంతో దిగుబడులు తగ్గుతాయని ఆందోళన చెందుతున్నారు. పంట చేతికొచ్చే టైంలో అధిక వర్షాలు పడుతుండడంతో అప్పులు ఎలా తీర్చాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తికి మార్కెట్​లో ధర ఎక్కువగా ఉన్నప్పటికీ విడువకుండా కురుస్తున్న వానలతో దిగుబడి భారీగా తగ్గే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు.

పూత, కాత లేని పత్తి పంట
వానలకు తోడు తెగుళ్లతో పత్తి చేలు కొన్ని చోట్ల ఏపుగా పెరిగినా పూత, కాత పెద్దగా లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. విడువకుండా కురుస్తున్న వానలతో పంట చేలల్లో వరద నీరు చేరడంతో మొదళ్లతో పాటు పత్తి కాయలు కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. కోతకు వచ్చే టైమ్​లో వరి పంటను నీటి పాలైందని వాపోతున్నారు. ఎకరానికి సాధారణంగా 8 నుంచి 10 క్వింటాళ్ల మేర పత్తి దిగుబడి వస్తుంది. ఈ సారి ఎకరానికి 4 నుంచి 6 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. పత్తికి మద్దతు ధర రూ. 6,600 కాగా, బహిరంగ మార్కెట్​లో రూ. 8వేలకు పైగా పలుకుతోంది. ఇదిలాఉంటే ప్రస్తుత పరిస్థితిలో వరి పంట ఎకరానికి 16 నుంచి 19 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. అధిక వర్షాలు, వాతావరణంలో మార్పులతో మిర్చి కూడా తెగుళ్ల బారిన పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే వర్షాలు, తెగుళ్ల దాడి నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పిస్తామని డీఏవో అభిమన్యుడు తెలిపారు.

ప్రతి నెలా అధిక వర్షపాతమే.. 
జిల్లాలో 1,64,109 ఎకరాల్లో వరి, 1,61,992 ఎకరాల్లో పత్తి, 50,908 ఎకరాల్లో మొక్కజొన్న, 18,418 మిర్చి, 6,288 ఎకరాల్లో కంది పంటలు సాగవుతున్నాయి. జూన్​ నెలలో 144.8 ఎంఎం సాధారణ వర్షపాతం కాగా, 225.3 ఎంఎం, జులై నెలలో సాధారణ వర్షపాతం 328.9 ఎంఎం కాగా, 605.5ఎంఎం, ఆగస్టులో 286.7ఎంఎం కాగా, 281.4ఎంఎం, సెప్టెంబర్​లో 162.1 ఎంఎం కాగా, 291.7ఎంఎం, అక్టోబర్​ నెలలో ఇప్పటి వరకు 47.7 సాధారణ వర్షపాతం కాగా, 112.3ఎంఎం వర్షపాతం నమోదైంది.