ఖమ్మం జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యేల పర్యటన

ఖమ్మం జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యేల పర్యటన

ఖమ్మం రూరల్, వెలుగు : ఆకేరు వరద బాధితులంతా ధైర్యంగా ఉండాలని, అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని ఖమ్మం ఎంపీ  రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. మంగళవారం రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ బాబుతో కలిసి  ఖమ్మం రూరల్​ మండలంలోని కస్నాతండా, వాల్యాతండా ల్లో ఇంటింటికీ వెళ్లి పరిస్థితిని అడిగి తెలుకున్నారు. వాల్యాతండా వద్ద బ్రిడ్జిని, దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.  ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేశారు.   

మణుగూరు : మణుగూరు లోని వరద ముంపు ప్రాంతాల్లో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటించారు. బాధితులనుప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని  హామీ ఇచ్చారు.


వైరా : వైరా మున్సిపాలిటీ పరిధిలోని ముంపు బాధితులకు ప్రభుత్వం అందించిన నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే రాందాస్​ నాయక్​ పంపిణీ చేశారు. బాధితులకు ఇబ్బందుల్లేకుండా చూస్తామన్నారు.

అశ్వారావుపేట : పెద్దవాగు ప్రాజెక్ట్ వద్ద 30 మీటర్ల మేర వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన పోతమట్టి పనులను పది రోజుల్లో పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆదేశించారు. మంగళవారం అశ్వారావుపేట మండలం పెద్దవాగు ప్రాజెక్టును ఆయన సందర్శించి పలు సూచనలు చేశారు. 

పాల్వంచ :  భారీ వర్షాల మూలంగా వచ్చిన నీటిని ఏమాత్రం ముందస్తు సమాచారం లేకుండా కేటీపీఎస్ అధికారులు కిన్నె రసాని 12 గేట్ల లాకులు ఎత్తి నీటిని వదలడం మూలంగానే రై తులకు భారీ నష్టం వాటిల్లిందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఫైర్ అయ్యారు. మంగళవారం మండల,పట్టణ పరిధిలోని నాగారం, సోముల గూడెం, బసవతారక కాలనీ, రంగాపురం, ఇందిరా కాలనీ, హమాలీ కాలనీల్లో ఆయన పర్యటించారు. దెబ్బతిన్న రోడ్లు, కరెంట్​ స్తంభాలకు వెంటనే రిపేర్లు చేపట్టాలన్నారు. 

సత్తుపల్లి :  వర్షాలతో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు ప్రణాళికతో అలర్ట్​గా ఉండాలని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి సూచించారు. మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్, విద్యుత్, వ్యవసాయ, మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.