ఎన్టీఆర్ చేతికి కత్తి.. రంగు మారింది.. కొత్త ప్లేస్ లో విగ్రహావిష్కరణ

ఎన్టీఆర్ చేతికి కత్తి.. రంగు మారింది.. కొత్త ప్లేస్ లో విగ్రహావిష్కరణ


ఖమ్మం పట్టణంలోని లకారం ట్యాంక్ బండ్ పై ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ వివాదానికి తెర పడినట్లే కనిపిస్తుంది. శ్రీకృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం తయారు చేయటం.. చేతిలో పిల్లన గ్రోవి ఉండటంపై యాదవ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని రూపొందించటంపై హైకోర్టులో పలు పిటీషన్లు దాఖలు కావటంతో.. విగ్రహావిష్కరణకు బ్రేక్ పడింది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ విగ్రహాన్ని మార్చారు.. అదే విధంగా లకారం ట్యాంక్ బండ్ పై కాకుండా పక్కనే ఉన్న ఓ ప్రైవేట్ స్థలంలో విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించారు నిర్వాహకులు. 

ప్రస్తుతం ఎన్టీఆర్ విగ్రహం రంగు కూడా నీలమేఘ శ్యాముడి నుంచి బంగారు రంగులోకి మార్చారు. అదే విధంగా చేతిలోని పిల్లనగ్రోవిని తొలగించి.. ఆ స్థానంలో కత్తి పెట్టారు. అదే విధంగా నెమలి పింఛాన్ని తొలగించారు. యాదవ సంఘాల అభ్యంతరాలకు వీటన్నింటిని మార్చారు. ట్యాంక్ బండ్ పై కాకుండా ఓ ప్రైవేట్ స్థలంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు మళ్లీ ఏర్పాట్లు ప్రారంభించారు నిర్వాహకులు. 

ఎన్టీఆర్ విగ్రహంలోని మార్పులు అన్నీ పూర్తి అయ్యాయి. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే మరో తేదీ ప్రకటించి.. జూనియర్ ఎన్టీఆర్ చేతులు మీదుగా ప్రారంభోత్సవం చేయటానిక సిద్ధం అవుతున్నారు. ఈ మేరకు 2023, జులై ఒకటో తేదీన కమిటీ సమావేశం అవుతున్నట్లు సమాచారం.