ఖమ్మం టౌన్, వెలుగు : ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఖమ్మం స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డితో కలిసి ఆమె ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ 9వ డివిజన్ కార్పొరేటర్ షేక్ జాన్ బీ రోటరీ నగర్ లో ఇండ్ల మధ్యలో ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ ను తొలగించాలని దరఖాస్తు సమర్పించగా ఈఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు రాస్తూ నిబంధన ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ సన్యాసయ్య, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రతి శుక్రవారం ప్రత్యేక తనిఖీ..
ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలుపై మండల ప్రత్యేక అధికారులు దృష్టి సారించాలని అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం అనంతరం ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో ఆమె సమీక్షించారు.
తి మండల పరిధిలో ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం అమలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థల నిర్వహణ, ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. మండల పరిధిలో ప్రతిపాదించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో ప్రారంభించాలని చెప్పారు.
ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద అన్ని వసతులు ఉన్నాయో.. లేదో చెక్ చేయాలని సూచించారు. విద్యా సంస్థలను తనిఖీ చేస్తూ అక్కడ పారిశుధ్య నిర్వహణ, భోజన నాణ్యత, పిల్లలకు అవసరమైన వసతుల కల్పన లాంటి అంశాలను పరిశీలించి నివేదిక అందించాలన్నారు.
సమస్యలకు తక్షణ పరిష్కారం..
ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ పరిష్కారం చూపాలని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆయా విభాగాల అధికారులను డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు ఆదేశించారు. ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ లో డిప్యూటీ కమిషనర్ ఆయా ప్రజావాణి కేంద్రాల్లో ప్రజల నుండి అందిన ఫిర్యాదులు, వినతులను స్వీకరించి పరిశీలించారు.
ప్రతి అభ్యర్థనపై సంబంధిత శాఖాధికారులతో చర్చించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్త మున్సిపల్ కార్యాలయం, బల్లేపల్లి నార్త్ జోనల్ కార్యాలయం, సౌత్ జోన్ పాత మున్సిపల్ కార్యాలయం, వెస్ట్ జోన్ జమలాపురం కేశవరావు పార్క్ లో గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్ విభాగాల అధికారులు, వార్డ్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.
