- నేటి భారతదేశం – వామపక్షాలు ఎదుర్కొంటున్న సవాళ్లు’ అంశంపై ఖమ్మంలో సెమినార్
ఖమ్మం టౌన్, వెలుగు : ‘దేశంలో వామపక్షాల భవిష్యత్ ఏమిటన్న ప్రశ్న తరచూ వినిపిస్తోంది.. కానీ దేశ భవిష్యత్తే వామపక్షాలపై ఆధారపడి ఉంది’ అని ఆయా పార్టీల నేతలు చెప్పారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య మునుపెన్నడూ లేనంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాయన్నారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీతో దేశంలో స్వేచ్ఛ, హక్కులకు భంగం కలుగుతుందని ఆరోపించారు. ‘నేటి భారతదేశం – వామపక్షాలు ఎదుర్కొంటున్న సవాళ్లు’ అనే అంశంపై సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మంలో సెమినార్ నిర్వహించారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షత జరిగిన సెమినార్‌కు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, సీపీఐ ఎంఎల్ లిబరేషన్ జాతీయ కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, అలిండియా ఫార్వర్డ్ బ్లాక్ జాతీయ కార్యదర్శి జి. దేవరాజన్, తెలంగాణ డిప్యూటీ సీఎం ముల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... తెలంగాణ సాయుధ పోరాటం దేశ చరిత్రలోనే సువర్ణాధ్యాయం అన్నారు. దేశ స్వాతంత్ర్య పోరాటం మొదలు ఇప్పటివరకు ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలకు ఎలాంటి స్థానం లేదన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు, చరిత్రను వక్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందన్నారు. భారతదేశం అనేక రాష్ట్రాల సమ్మేళనమని.. ఆ వ్యవస్థకు బీజేపీ తూట్లు పొడుస్తుందని ఆరోపించారు. బీజేపీ.. ఆర్‌ఎస్‌ఎస్ చేతిలో కీలుబొమ్మగా మారిందని విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజన పేరుతో దక్షిణ భారత రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గించే కుట్ర చేస్తున్నారన్నారు.
ఓటర్ల లిస్ట్ నుంచి బీజేపీ వ్యతిరేక వర్గాలను తొలగిస్తున్నారని, ఇందులో భాగంగా బిహార్ సహా అనేక రాష్ట్రాల్లో లక్షలాది ఓట్లను తొలగించారని ఆరోపించారు. కేంద్రం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రాం కాస్తా.. స్పెషల్ ఇంటెన్సివ్ రిమూవల్‌గా మారిందన్నారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు ధారదత్తం చేస్తున్నారని, బీజేపీ ప్రభుత్వం అంబానీ, అదానీ కోసమే పనిచేస్తోందన్నారు.
రక్షణ, అణుశక్తి రంగాలను కూడా ప్రైవేటీకరించడం వెనుక కార్పొరేట్ శక్తుల కుట్ర ఉందన్నారు. బీజేపీ నేతృత్వంలోని మతతత్వ శక్తులు ప్రజాస్వామ్యాన్ని, పార్లమెంట్‌ను నిర్వీర్యం చేస్తున్నాయన్నారు. సెమినార్‌లో సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు అమర్ జీత్ కౌర్, గిరీశ్ శర్మ, రామకృష్ణ పాండే, సంజయ్‌కుమార్, కె.ప్రకాశ్‌బాబు, పల్లవ్‌సేన్ గుప్తా, కె. రామకృష్ణ పాల్గొన్నారు.
