చివరి శ్వాస వరకు పేదల కోసం పోరాడుతా: ఖర్గే

చివరి శ్వాస వరకు పేదల కోసం పోరాడుతా: ఖర్గే

కలబురగి: కర్నాటక భూమి పుత్రుడిగా చివరి శ్వాస వరకూ పేదల కోసమే పోరాడుతానని కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. తన నియోజకవర్గం కలబురగిలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఖర్గే మాట్లాడారు. ‘‘నన్ను, నా కుటుంబాన్ని చంపేందుకు కుట్రపన్నినట్లు ఓ ఆడియో బయటకు వచ్చింది. నా కుటుంబాన్ని చంపుతానంటూ చిత్తాపూర్  నియోజకవర్గ  బీజేపీ అభ్యర్థి మణికంఠ రాథోడ్  ఆ ఆడియోలో  పేర్కొన్నట్లు వినిపించింది. ఆ బెదిరింపుల వెనుక ఎవరో పెద్ద లీడరే ఉండి ఉండాలి. కర్నాటక రాష్ట్ర ప్రజలు నా వెనుక ఉన్నారు. ఎవరూ నన్ను అంత త్వరగా అంతం చేయలేరు” అని ఖర్గే వ్యాఖ్యానించారు. ఒకవేళ తనను చంపేస్తే తన స్థానాన్ని మరొకరు భర్తీ చేస్తారని అన్నారు. ‘‘రాజకీయంగా ఎదుర్కొంటే నన్ను ఎదుర్కోండి. నా కొడుకును ఎందుకు లాగుతారు? 52 ఏళ్లుగా నేను రాజకీయాల్లో ఉన్నా. నాకు 81 ఏళ్లు నిండాయి. మరో 8 లేదా 9 సంవత్సరాలు బతకొచ్చు. ఈ వయసులో నన్ను చంపాలనుకుంటే చంపండి. మీ (బీజేపీ నేతలు) సమస్యలు పరిష్కారం అవుతాయనుకుంటే అలాగే  చేయండి” అని ఖర్గే వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ చీఫ్​గా చేసినందుకు గెలిపించాలె..

తనను కాంగ్రెస్ చీఫ్​గా చేసినందుకు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్  పార్టీని గెలిపించాలని ప్రజలకు ఖర్గే విజ్ఞప్తి చేశారు. ఒక జాతీయ పార్టీకి తాను ప్రెసిడెంట్​గా ఉన్నందుకు కలబురగి ప్రజలు గర్వపడాలని అన్నారు. కలబురగి ప్రజల ఆశీర్వాదం వల్లే తాను అసెంబ్లీ, పార్లమెంటులో అడుగు పెట్టానని చెప్పారు. ‘‘లోక్ సభ ఎన్నికల్లో నేను ఓడిపోయినా.. సోనియా గాంధీ నన్ను ప్రతిపక్ష లీడర్​ను చేశారు. రాజ్యసభకు నామినేట్  చేశారు. ఇపుడు ఏకంగా కాంగ్రెస్​కు  ప్రెసిడెంట్ గా నియమించారు. ఈ విషయంలో కలబురగి ప్రజలు గర్వించాలి” అని ఖర్గే అన్నారు. 

అది ఫేక్  ఆడియో

ఖర్గే ఫ్యామిలీని చంపేందుకు కుట్రపన్నినట్లు బయటకు వచ్చిన ఆడియోపై చిత్తాపూర్ బీజేపీ అభ్యర్థి మణికంఠ స్పందించారు. అది ఫేక్   ఆడియో అని, ఓటమి భయంతోనే కాంగ్రెస్  పార్టీ తనపై నిరాధార ఆరోపణలు చేస్తోందని ఆయన మండిపడ్డారు.