
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దేశంలో మోడీ ప్రభుత్వ అవినీతి పాలన ముగింపుకు నాంది పలుకుతాయని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. బీహార్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాం, ఓట్ చోరీ విషయంలో బీజేపీని మరింత ఇరుకున పెట్టడంపై చర్చించేందుకు బీహార్ రాజధాని పాట్నాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) బుధవారం (సెప్టెంబర్ 24) భేటీ అయ్యింది. సదాకత్ ఆశ్రమంలో మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, అజయ్ మాకెన్, కేసీ వేణుగోపాల్ తో పాటు సీడబ్ల్యూసీ శాశ్వత సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్ర సీఎంలు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. బీజేపీ మతతత్వ రాజకీయాలపై బీహార్ ప్రజలు ఆసక్తి చూపడం లేదని, అభివృద్ధి, సంక్షేమం ఆధారంగా రాజకీయాలను కోరుకుంటున్నారని అన్నారు. బీహార్‌లో ఎన్డీఏ కూటమిలో లుకలుకలు మొదలయ్యాయని.. సీఎం నితీష్ కుమార్‌ను బీజేపీ ఒక భారంగా భావిస్తోందని ఆరోపించారు. దౌత్యంలో అంతర్జాతీయ స్థాయిలో మోడీ, ఆయన ప్రభుత్వం వైఫల్యం చెందిందని.. మోడీ నా ఫ్రెండ్ అని చెప్పుకునే అమెరికా అధ్యక్షుడు ట్రంపే ఇండియాను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని విమర్శించారు.
ఓట్ చోరీ విషయంలో ఎన్నికల కమిషన్ నిష్పాక్షికత, పారదర్శకతపై ఆందోళనలు తలెత్తుతున్నాయని అన్నారు. వివిధ రాష్ట్రాల్లో ఓట్ చోరీపై రాహుల్ గాంధీ లేవనెత్తే విషయాలను పరిష్కరించకుండా.. అఫిడవిట్లు సమర్పించాలని ఈసీ ఒత్తిడి చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు. స్పెషల్ ఇంటెన్స్ రివిజన్ (సర్) పేరుతో బీహార్ తరహాలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఓట్లను చీల్చడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఓట్ చోరీ చేయడమంటే దళితులు, గిరిజనులు, వెనుకబడినవారు, అత్యంత వెనుకబడినవారు, మైనారిటీల హక్కులను దొంగలించడమేనని అన్నారు.