చందా దేవో.. దందా కరో

చందా దేవో.. దందా కరో
  •  ఇదే మోదీ నినాదం..రాజ్యసభలో ఖర్గే విమర్శలు
  • లీకేజీలతో ఎన్డీయేమూడో టర్మ్​ ప్రారంభం
  • ఎలక్షన్​ ప్రచారంలో మోదీ చెప్పిన అసలు సినిమా ఇదేనా?
  •  రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ

న్యూఢిల్లీ: ‘చందా దేవో.. దందా కరో..’ ఇది ప్రధాని మోదీ నినాదమని, ఆయన స్లోగన్స్​ ఇవ్వడంలో ఎక్స్​పర్ట్​ అని ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. లోక్​సభ ఎన్నికల ప్రచారంలో మోదీ విద్వేషాలు రెచ్చగొట్టారని, కాంగ్రెస్​ పార్టీ గెలిస్తే మహిళల మంగళసూత్రాలతో సహా ప్రజల ఆస్తులను లాక్కుంటుందని మోదీ తప్పుడు ప్రచారం చేశారని అన్నారు. అందుకే ప్రజలు బీజేపీకి సరైన తీర్పు ఇచ్చారని ఎద్దేవా చేశారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సోమవారం చర్చ జరిగింది. 

ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. ఎన్డీయే సర్కారు మూడో టర్మ్​ లీకులతోనే ప్రారంభమైందని అన్నారు. ఆరంభంలోనే పేపర్​ లీక్స్​, జమ్మూకాశ్మీర్​లో టెర్రర్​ అటాక్, ట్రెయిన్​ యాక్సిడెంట్, ఎయిర్​పోర్ట్​ టెర్మినల్, బ్రిడ్జిలు కూలడం, టోల్ ​ట్యాక్స్​ హైక్ ​లాంటి ఘటనలు చూశామని తెలిపారు. అయోధ్య గుడిలోనూ లీకేజీలు బయటపడ్డాయని ఎద్దేవా చేశారు.

అసలు సినిమా ఇదేనా?

లోక్​సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ‘పదేండ్లు మీరు చూసింది ట్రైలరే.. అసలు సినిమా ముందుంది’ అని మోదీ చేసిన వ్యాఖ్యలకు ఖర్గే కౌంటర్​ ఇచ్చారు. ఇదేనా అసలు సినిమా? అని చురకలంటించారు. ఇది తాము ముందే ఊహించామని అన్నారు.  పేపర్​ లీక్స్​తో 30 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడిందని చెప్పారు. 

ఇలాగే జరిగితే.. చాలామంది స్టూడెంట్స్​ చదువులను వదిలిపెడతారని అన్నారు. గత ఏడేండ్లలో 70 సార్లు పేపర్​ లీకులు జరిగాయని, 2 కోట్ల మంది స్టూడెంట్లు​ నష్టపోయారని అన్నారు. దీన్ని అరికట్టేందుకు ఎన్డీయే సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా పార్లమెంట్​లో ఈ అంశాన్ని లేవనెత్తినందుకు ప్రతిపక్షాలను నిందిస్తోందని మండిపడ్డారు.

సామాన్యుల గురించి మోదీకి పట్టదు

రాజ్యసభలో ప్రధాని మోదీపై ఖర్గే విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలు సాధారణ పౌరుల సమస్యలపై మాట్లాడుతుంటే..మోదీ మాత్రం మన్ కీ బాత్​ చేస్తున్నారని విమర్శించారు. నినాదాలు ఇవ్వడంలో మోదీ ఎక్స్​పర్ట్​ అని చురకలంటించారు. ఎన్నికల సమయంలో తన ప్రసంగాల ద్వారా సమాజాన్ని విభజించేందుకు మోదీ ప్రయత్నించారని ఆరోపించారు. ఇంతకు ముందు ఏ ప్రధాని కూడా ఇలా చేయలేదని అన్నారు. 

 విపక్షాలను అణగదొక్కడం మోదీకి అలవాటైందని, ఇందుకోసం దర్యాప్తు సంస్థలను పావుల్లా వాడుకుంటున్నారని మండిపడ్డారు. కర్నాటక, మధ్యప్రదేశ్​తో సహా ప్రతిపక్ష ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో నేతలు, సీఎంలను అక్రమంగా కేసుల్లో ఇరికిస్తున్నారని అన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను అక్రమంగా అరెస్టు చేశారని, ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో ఇరికించారని విమర్శించారు. జార్ఖండ్  సీఎం హేమంత్ సోరేన్ పై అక్రమ కేసులు బనాయించారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టడం ప్రజాస్వామ్యానికే అవమానమని మండిపడ్డారు. 

మణిపూర్​ అంశాన్ని రాష్ట్రపతి ప్రస్తావించలేదు

గతవారం ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంపై మల్లికార్జున ఖర్గే దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మణిపూర్​ అంశాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రస్తావించలేదని అన్నారు. గత ఏడాదినుంచి అట్టుడుకుతున్న మణిపూర్​ను ఇప్పటివరకూ ప్రధాని మోదీ సందర్శించలేదని మండిపడ్డారు. రాష్ట్రపతి చేసిన ప్రసంగంలో దార్శనికత, దిశానిర్దేశంలేదని, కేవలం నినాదాలు మాత్రమే ఇస్తున్నారని, అభివృద్ధి పనులు చేయడంలేదని అన్నారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను రాష్ట్రపతి విస్మరించారని, కేంద్ర సర్కారు వైఫల్యాలను దాచిపెట్టారని ఆరోపించారు. ప్రసంగంలో 
పేదలు, దళితులు, మైనార్టీల ప్రస్తావనే లేదని అన్నారు. 

రాజ్యసభలో ఖర్గే వర్సెస్​ నడ్డా

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ప్రతిపక్ష నేత ఖర్గే.. నీట్​ అవకతవకలు, ఇతర అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా అధికార పక్షనేత నడ్డా, ప్రతిపక్ష నేత ఖర్గే మధ్య మాటల యుద్ధం నడిచింది. ఖర్గే మాట్లాడుతూ.. “గత 18 నెలల్లో జరిగింది గుర్తుంచుకోండి.. రాబోయే మూడు లేదా మూడున్నరేండ్లు మీరు సత్యం వైపు నిలబడండి” అని చైర్మన్​ ధన్​ఖడ్​కు విజ్ఞప్తి చేశారు.

 దీనిపై స్పందించిన ధన్​ఖడ్​.. తాను ఎప్పుడూ సత్యంవైపు ఉంటానని నవ్వుతూ అన్నారు. కాగా, ఖర్గే వ్యాఖ్యలపై నడ్డా మండిపడ్డారు. “మరో మూడేండ్లు చైర్మన్​ సత్యం వైపు నిలబడాలని కోరుతున్నారు. అంటే గతంలో ఆయన అలా లేరనేనా అర్థం?” అని ప్రశ్నించారు. ‘ఆర్ఎస్​ భావజాలం దేశానికి ప్రమాదకరం.. దళితులకు విద్యను నిరాకరిస్తున్నారు’ అని ఖర్గే వ్యాఖ్యానించగా.. దీనిని నడ్డా తప్పు పట్టారు.

సభలో నవ్వుల పువ్వులు

సమావేశాల ప్రారంభంలో వాడీవేడీగా జరిగిన చర్చలు.. సోమవారం ఖర్గే, ధన్​ఖడ్ మధ్య సరదా సంభాషణలతో నవ్వులు పూయించాయి. రాష్ట్రపతికి ధన్యవాద తీర్మానంపై చర్చించేందుకు లేచి నిలబడ్డ ఖర్గే.. మోకాళ్ల నొప్పులతో తాను ఎక్కువసేపు నిలబడలేకపోతున్నానని, చైర్మన్​ అనుమతిస్తే కూర్చొని మాట్లాడుతానని అన్నారు. దీనిపై స్పందించిన ధన్​ఖడ్​.. ‘‘మీకు సౌకర్యంగా ఉండేలా చూసుకోండి..మీరు కూర్చొని కూడా మాట్లాడొచ్చు.. అది మీ ఇష్టం” అని ఖర్గేకు సూచించారు. ఈ విషయంలో మీకు సాయం చేస్తానని ఖర్గేతో ధన్​ఖడ్​ అన్నారు. 

దీనిపై ఖర్గే స్పందిస్తూ.. “మీరు చేసిన సాయం మాకు గుర్తుంది” అని అనడంతో సభలో నవ్వులు చిందాయి. నవ్వులతో సభ్యులు నన్ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.. దీనికి చైర్మన్​ తోడయ్యారు” అని ఖర్గే అనగానే మళ్లీ నవ్వులు విరబూసాయి. వీరిద్దరి సంభాషణ చూసి కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ కూడా ముసిముసిగా నవ్వారు.