
సూర్యాపేట జిల్లా : దీపావళి పండుగ రోజున కిడ్నాపైన బాలుడు క్షేమంగా తల్లిదండ్రుల దగ్గరకు చేర్చామని తెలిపారు సూర్యాపేట జిల్లా ఎస్పీ భాస్కరన్. డబ్బుల కోసమే కిడ్నాపర్లు బాలుడిని ఎత్తుకెళ్లారని చెప్పారు. 13వ తేదీన రెక్కీ నిర్వహించి లాడ్జిలో ఉన్న కిడ్నాపర్లు 14వ తేదీన బాలుడు గౌతమ్ ను కిడ్నాప్ చేశారన్నారు. బాబును మొదట మిర్యాలగూడకు తీసుకెళ్లి, అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లారన్నారు. ముగ్గురు కిడ్నాపర్లు గుంటూరు జిల్లా మాచర్ల మండలంలోని రెండు గ్రామాలకు చెందిన వారని,ఈజీ మనీ కోసమే కిడ్నాప్ చేశారన్నారు.
నిందితులంతా బాటసారుల ఫోన్ ల సహాయంతో బాలుడి తండ్రికి ఫోన్ చేసి రూ 10 లక్షలు డిమాండ్ చేశారన్నారు. రూ.7లక్షలకు ఒప్పందం కుదరడంతో డబ్బుల కోసం మళ్లీ ఫోన్ చేశారని.. ముగ్గురు నిందితుల్లో ఇద్దరు మైనర్లని చెప్పారు. అయితే ఓ సారి మాత్రం వేరే వ్యక్తుల నుంచి కాకుండా వారి మొబైల్ నుంచే ఫోన్ చేయడంతో నిందితుల ఆచూకీ కనిపెట్టగలిగామన్నారు పోలీసులు. రూ.7లక్షలకు ఒప్పందం కుదరడంతో డబ్బులు ఇస్తామని కిడ్నాపర్లను నమ్మించిన పోలీసులు.. నిందితులను పట్టుకున్నామన్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించామన్నారు. రెండ్రోజులుగా కనిపించకుండా పోయిన కొడుకు తిరిగి రావడంతో గుండెలకు హత్తుకుని ఏడ్చారు తల్లిదండ్రులు. పోలీసులు ధన్యవాదాలు తెలిపారు.