
శ్రీశైలం ప్రాజెక్టుకు పెద్ద పెద్ద గండ్లు పెట్టి పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు వందల టీఎంసీల జలాలను తీసుకెళ్తున్న ఏపీ.. తుంగభద్ర నదిపైనా కుట్రలు చేస్తున్నది. కేసీ కెనాల్ ద్వారా ఇప్పటికే బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ నుంచి శ్రీశైలం (కృష్ణా) జలాలను తరలిస్తున్న ఆ రాష్ట్రం తుంగభద్ర నీటినీ కాజేయాలన్న ఎత్తుగడలు వేస్తున్నది. 20 టీఎంసీల జలాలను కేసీ కెనాల్లోకి పోయాలని.. దానితో కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లోని 2.65 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలని ప్రయత్నిస్తున్నది. 20 టీఎంసీల స్టోరేజీతో సుంకేశుల బ్యారేజీకి ఎగువన తుంగభద్ర నదిపై గుండ్రేవుల రిజర్వాయర్ను గతంలోనే ఏపీ ప్రతిపాదించింది. దీనిపై ఇప్పటికే ట్రిబ్యునల్లోనూ కేసు నడుస్తున్నది.
వాస్తవానికి బచవాత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం తుంగభద్ర నుంచి వచ్చే జలాలపై ఏ ప్రాజెక్టునూ నిర్మించడానికి లేదు. ఆ జలాలు శ్రీశైలానికి వచ్చేలా బచావత్ట్రిబ్యునల్అవార్డులో స్పష్టం చేసింది. కానీ, ఏపీ మాత్రం అందుకు విరుద్ధంగా కృష్ణాకు నీళ్లు రాకుండా అటు నుంచి అటే నీటిని తన్నుకుపోయే కుట్రలకు పాల్పడుతున్నది. దీనిని కూడా ఇంట్రాలింక్లో చేర్చాలంటున్నది. ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 6 గ్రామాలు ముంపునకు గురవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
Also read:-నీళ్లపై గుట్టుగా ఏపీ కుట్రలు!.. బనకచర్లకు తోడు మరో నాలుగు లింక్ ప్రాజెక్టులకు గురి
పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్టుతో వందల కొద్దీ టీఎంసీలను తరలించుకుపోయే కుట్రలకు తెరలేపిన ఏపీ సర్కారు.. ఇప్పుడు సైలెంట్గా మరిన్ని కుట్రలు చేస్తుండటం గమనార్హం. ఇప్పటికే ఆ రాష్ట్రంలో మొదలుపెట్టిన నాలుగు ప్రాజెక్టులను ఇంట్రా ప్రాజెక్టులుగా చేపట్టాలంటూ కేంద్రానికి సిఫార్సులూ చేసింది. వీటి ద్వారా.. మరో 150 టీఎంసీల దాకా నీటిని ఎత్తుకెళ్లిపోయేందుకు కసరత్తు చేస్తున్నది.