
- వాటిలో మూడు పోలవరం ఆధారంగా నిర్మించేవే
- 2023లో ఎన్‌డబ్ల్యూడీఏ చర్చల్లో స్పష్టం చేసిన ఏపీ.. తాజాగా ఎజెండాలో వెల్లడి
- గోదావరి–కావేరీ లింక్ అయితే మిగులు జలాలు లేవంటున్న ఆంధ్రప్రదేశ్
- బనకచర్ల లింక్ అయితే మిగులు జలాలతోనే కడుతామని బుకాయింపులు
హైదరాబాద్, వెలుగు: పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్టుతో వందల కొద్దీ టీఎంసీలను తరలించుకుపోయే కుట్రలకు తెరలేపిన ఏపీ సర్కారు.. ఇప్పుడు సైలెంట్‌గా మరిన్ని కుట్రలు చేస్తున్నది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో మొదలుపెట్టిన నాలుగు ప్రాజెక్టులను ఇంట్రా ప్రాజెక్టులుగా చేపట్టాలంటూ కేంద్రానికి సిఫార్సులూ చేసింది. వీటి ద్వారా.. మరో 150 టీఎంసీల దాకా నీటిని ఎత్తుకెళ్లిపోయేందుకు కసరత్తు చేస్తున్నది.
ఈ నాలుగు ప్రాజెక్టుల్లోనూ మూడు పోలవరం ఆధారంగానే చేపడుతున్నవే. 2023లోనే కేంద్ర ప్రభుత్వంతో వీటిపై చర్చించగా.. తాజాగా ఆ ఇంట్రాలింక్ ప్రాజెక్టుల విషయం బయటపడింది. ఈ నెల 22న నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ).. గోదావరి– కావేరి (జీసీ) లింక్‌పై ఆరో కన్సల్టెన్సీ మీటింగ్‌ను హైదరాబాద్‌లో నిర్వహించనుంది. ఈ క్రమంలో ఆ మీటింగ్ ఎజెండాలోనే ఈ నాలుగు ఇంట్రాలింక్ ప్రాజెక్టులను ఎన్‌డబ్ల్యూడీఏ చేర్చడం గమనార్హం. గోదావరి –కావేరి లింక్‌లో భాగంగా ఆ నాలుగు ప్రాజెక్టులనూ కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలంటూ ఏపీ కోరింది. పోలవరం దిగువన ఎడమవైపున చింతలపూడి లిఫ్ట్ స్కీమ్, కుడివైపున ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టులో భాగంగా పల్నాడు డ్రాట్ మిటిగేషన్ స్కీమ్, తుంగభద్ర నదిపై గుండ్రేవుల రిజర్వాయర్ల నిర్మాణానికి సహకరించాలని కేంద్రాన్ని కోరింది. గోదావరి – కావేరి లింక్ ప్రాజెక్టు చేపట్టడానికన్నా ముందే ఈ నాలుగు ఇంట్రాలింక్ ప్రాజెక్టులను చేపట్టాలనీ ఏపీ సూచించింది. ఏపీ సూచనలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఆ 4 ప్రాజెక్టుల డీపీఆర్లనూ సమర్పించాలని ఏపీకి సూచించింది.తర్వాత నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.
చింతలపూడి స్కీమ్‌తో 53 టీఎంసీలకు ప్లాన్
పోలవరం ప్రాజెక్టు దిగువన ఎడమవైపు చింతలపూడి ఎత్తిపోతల పథకానికి ఉమ్మడి ఏపీలోనే అడుగు పడింది. అయితే, అటవీ భూముల సేకరణలో ఆలస్యం కావడంతో లేట్ అయింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలోని కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో కొత్తగా 2 లక్షల ఎకరాలకు నీళ్లివ్వడంతో పాటు మరో 2.8 లక్షల ఎకరాలను స్థిరీకరించాలని లక్ష్యంగా ఏపీ పెట్టుకుంది. ఈ లిఫ్ట్ స్కీమ్ ద్వారా 90 రోజుల పాటు 53 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని భావిస్తున్నది. రూ.9,547 కోట్లతో ప్రాజెక్టును నిర్మిస్తుండగా.. మరో రూ.4,465 కోట్లను ఖర్చు చేస్తే ప్రాజెక్టు పూర్తవుతుందని చెప్తున్నది. ఇప్పటికే ఆ లిఫ్ట్‌లోని పంప్‌హౌస్ పనులు 78 శాతం, పైప్‌లైన్ పనులు 81 శాతం వరకు పూర్తయ్యాయి. 7.55 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ వేయాల్సి ఉన్నది. 106 కిలోమీటర్ల మేర కాల్వను తవ్వాల్సి ఉండగా.. సగం పూర్తయింది. వీటిపై అక్విడక్టులు, సైఫన్లు, సూపర్ పాసేజ్‌లు, రెగ్యులేటర్ల వంటి నిర్మాణాలను చేపట్టాల్సి ఉన్నది. 2026 జూన్ నాటికి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్న ఏపీ.. ఇంట్రా లింక్‌లో భాగంగా దాన్ని చేపట్టాలని కేంద్రాన్ని కోరుతున్నది.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పేరుతో 63 టీఎంసీలు
గోదావరి జలాలను అసలు బేసిన్ కాని ఉత్తరాంధ్రకు తరలించేందుకు ఏపీ సర్కార్ ‘ఉత్తరాంధ్ర సుజల స్రవంతి’ స్కీమ్‌ను ఎత్తుకున్నది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలోని 8 లక్షల ఎకరాలకు సాగునీళ్లిచ్చే లక్ష్యంగా 63 టీఎంసీలను ఎత్తిపోయాలని భావిస్తున్నది. వెయ్యికిపైగా గ్రామాల్లోని 30 లక్షల మందికి తాగునీటిని సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. రెండు దశల్లో చేపట్టాలని భావిస్తున్న ఈ ప్రాజెక్టుకు రూ.17 వేల కోట్లకుపైగా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నది. ఇప్పటికే కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. 16 వేల ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా.. ఇప్పటికే 7 వేల ఎకరాలకు సర్వే పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టునూ వరద జలాల ఆధారంగానే నిర్మిస్తున్నట్లు చెప్తున్న ఏపీ.. దీనినీ ఇంట్రాలింక్లో భాగంగా చేపట్టాలని కేంద్రాన్ని కోరింది. ఈ ప్రాజెక్టులో భాగంగా పోలవరం ఎడమ కాల్వలోకి నీటిని ఎత్తిపోసి ఉత్తరాంధ్ర జిల్లాలకు నీటిని తరలించాలని ఏపీ నిర్ణయించింది. పర్యావరణ అనుమతుల్లేకుండా ప్రాజెక్టును చేపట్టడంతో ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏపీకి రూ.200 కోట్ల జరిమానానూ విధించింది. ప్రాజెక్టు పనులపై స్టే విధించింది. అయినా కూడా ఏపీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నది.
పల్నాడు లిఫ్ట్‌ను ఇంట్రాలింక్లో చేర్చాలనీ..!
పల్నాడు జిల్లాలో కరువును తీర్చేందుకు ఉమ్మడి ఏపీలోనే పల్నాడు డ్రాట్ మిటిగేషన్ స్కీమ్ కింద లిఫ్ట్‌ను అప్పటి సర్కారు తీసుకొచ్చింది. నాగార్జునసాగర్ ఆయకట్టును స్థిరీకరించేందుకు ప్రయత్నాలు చేసింది. అయితే, అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల నేపథ్యంలో ఆ స్కీమ్ ఇంకా ముందుకు పడలేదు. తాజాగా ఏపీ చేపట్టాలనుకుంటున్న పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టులో భాగంగా ఈ పల్నాడు డ్రాట్ మిటిగేషన్ స్కీమ్‌ను ఆ రాష్ట్రం చూపిస్తున్నది. దీని ద్వారా పోలవరం కుడి కాల్వ నుంచి నీటిని తరలించి ప్రకాశం బ్యారేజీకి ఎగువన కృష్ణా నదిలోకి ఎత్తిపోసి.. అక్కడి నుంచి లిఫ్టుల ద్వారా పల్నాడుకు నీటిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. 1996లోనే ఈ స్కీమ్‌కు శంకుస్థాపన చేశారు. వివిధ కారణాలతో ఇన్నేండ్లు అది ముందుకు సాగలేదు. రాష్ట్ర విభజన జరిగాక ఆ ప్రాజెక్టు పనుల్లో చలనం వచ్చింది. పల్నాడు జిల్లాలోని వెల్దుర్తి, ఉప్పలపాడు, గొట్టిపాళ్ల, శ్రీగిరిపాడు, బోదిలవీడు, గంగలకుంట, కండ్లకుంట గ్రామాల్లోని 20 వేల మందికి తాగునీరు, 24,900 ఎకరాలకు సాగు నీరు ఇచ్చేలా ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. దీనినీ ఇంట్రాలింక్లో చేర్చాలని ఏపీ కోరింది.
తుంగభద్రపైనా కుట్రలు..!
శ్రీశైలం ప్రాజెక్టుకు పెద్ద పెద్ద గండ్లు పెట్టి పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు వందల టీఎంసీల జలాలను తీసుకెళ్తున్న ఏపీ.. తుంగభద్ర నదిపైనా కుట్రలు చేస్తున్నది. కేసీ కెనాల్ ద్వారా ఇప్పటికే బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ నుంచి శ్రీశైలం (కృష్ణా) జలాలను తరలిస్తున్న ఆ రాష్ట్రం తుంగభద్ర నీటినీ కాజేయాలన్న ఎత్తుగడలు వేస్తున్నది. 20 టీఎంసీల జలాలను కేసీ కెనాల్లోకి పోయాలని... దానితో కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లోని 2.65 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలని ప్రయత్నిస్తున్నది. 20 టీఎంసీల స్టోరేజీతో సుంకేశుల బ్యారేజీకి ఎగువన తుంగభద్ర నదిపై గుండ్రేవుల రిజర్వాయర్‌ను గతంలోనే ఏపీ ప్రతిపాదించింది. దీనిపై ఇప్పటికే ట్రిబ్యునల్‌లోనూ కేసు నడుస్తున్నది. వాస్తవానికి బచవాత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం తుంగభద్ర నుంచి వచ్చే జలాలపై ఏ ప్రాజెక్టునూ నిర్మించడానికి లేదు. ఆ జలాలు శ్రీశైలానికి వచ్చేలా బచావత్ ట్రిబ్యునల్ అవార్డులో స్పష్టం చేసింది. కానీ, ఏపీ మాత్రం అందుకు విరుద్ధంగా కృష్ణాకు నీళ్లు రాకుండా అటు నుంచి అటే నీటిని తన్నుకుపోయే కుట్రలకు పాల్పడుతున్నది. దీనిని కూడా ఇంట్రాలింక్లో చేర్చాలంటున్నది. ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 6 గ్రామాలు ముంపునకు గురవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
మిగులు జలాలులేవనీ.. ఉన్నాయనీ..!
పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ విషయంలో ఏపీ ఒక్కోసారి ఒక్కో మాట మాట్లాడుతున్నది. సముద్రంలో కలిసే మిగులు జలాలు/వరద జలాలనే తరలిస్తామని అంటున్నది. అయితే, గోదావరి – కావేరి లింక్‌పై ఏపీతో ఎన్‌డబ్ల్యూడీఏ 2023లో చర్చలు జరిపినప్పుడు మాత్రం అసలు నీటి లభ్యతే లేదని ఆ రాష్ట్రం చెప్పడం గమనార్హం. గోదావరిలో అసలు మిగులు జలాలే లేవని, అలాంటప్పుడు గోదావరి– కావేరి లింక్‌ను చేపట్టడం ఎలా సాధ్యమవుతుందని ఎన్డబ్ల్యూడీఏకి చెప్పింది. నీటి తరలింపులకు కొత్త ప్రాజెక్టులను చేపడితే.. పోలవరం ప్రాజెక్టుపై ప్రభావం పడుతుందని అభ్యంతరమూ వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని ఎజెండాలో ఎన్‌డబ్ల్యూడీఏ స్పష్టంగా తేల్చి చెప్పింది. కానీ, ఇప్పుడు మాత్రం ఏపీ పాలకులు వరద జలాలు/మిగులు జలాలతోనే పోలవరం – బనకచర్ల లింక్‌ను చేపడుతున్నామని అంటున్నారు. అయితే, గోదావరి – కావేరి లింక్‌లో లేని మిగులు జలాలు.. బనకచర్ల ప్రాజెక్టులో మాత్రం ఎలా ఉంటాయన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. జలదోపిడీకి ఏపీ ఎన్ని మాటలైనా మారుస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు.. గోదావరి – కావేరి లింక్‌కు బదులు పోలవరం – బనకచర్ల లింక్‌లో భాగంగా.. తమిళనాడుకు నీటిని తరలించొచ్చని కేంద్రానికి చెప్తున్నది. బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి సోమశిలకు.. అక్కడి నుంచి కావేరి నదికి లింక్ చేసి నీళ్లను ఇవ్వాలని అంటున్నది. ఈ ప్రతిపాదనపైనా ఎన్‌డబ్ల్యూడీఏ పరిశీలన చేస్తామన్నట్టుగా ఎజెండాలో పేర్కొనడం గమనార్హం.
1)పోలవరం దిగువన ఎడమవైపు ‘చింతలపూడి లిఫ్ట్ స్కీమ్’
= నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టుకు నీళ్లిచ్చే ప్రణాళికలు
= 90 రోజులు 53 టీఎంసీలు లిఫ్ట్ చేసేలా ఎత్తుగడలు
= కృష్ణా, ఎన్టీఆర్, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో 4.8 లక్షల ఎకరాలకు నీళ్లు
2 పోలవరం దిగువన కుడివైపు ‘ఉత్తరాంధ్ర సుజల స్రవంతి’
= 63 టీఎంసీలు తరలించే ప్లాన్
= శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో 8 లక్షల ఎకరాలకు నీళ్లు
3 బనకచర్ల లింక్ ప్రాజెక్టులో భాగంగా ‘పల్నాడు స్కీమ్’
= పల్నాడు జిల్లాలోని 25 వేల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు కసరత్తు
4 తుంగభద్రపై 20 టీఎంసీల కోసం ‘గుండ్రేవుల రిజర్వాయర్’
= కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లోని 2.65 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రయత్నం