
భార్య, భర్త ఇద్దరూ ఉద్యోగాలు చేస్తే గాని గడవని పరిస్థితి వాళ్లది. బతుకుదెరువుకై హైదరాబాద్ వచ్చి ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఎప్పట్లాగే ఎవరి పనులకు వాళ్లు వెళ్లిన సమయంలో.. ఉన్నట్లుండి గుండెలు పగిలే వార్త వినాల్సి వచ్చింది ఆ దంపతులు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కూతురు.. నట్టింట్లో రక్తపు మడుగులో పడి ఉందని తెలిసీ గుండెలు బాదుకుంటున్నారు ఆ తల్లిదండ్రులు. హైదరాబాద్ కూకట్ పల్లిలో సోమవారం (ఆగస్టు 18) జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.
అభంశుభం తెలియని పన్నెండేళ్ల బాలిక అత్యంత దారుణంగా హత్యకు గురైన ఘటన కూకట్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని సంగీత్ నగర్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చిన వెంకటేష్, రేణుక దంపతులు ప్రైవేట్ ఎంప్లాయిస్ గా పనిచేస్తున్నారు. వెంకటేష్ బైక్ మెకానిక్ గా పనిచేస్తుండగా.. రేణుక ల్యాబ్ టెక్నీషియన్. ఇద్దరూ ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ముగ్గురు పిల్లలను పోషించుకుంటున్నారు.
వీరి పెద్ద కూతురు సహస్ర (12) స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. సోమవారం (ఆగస్టు 18) ఉదయం 9 గంటలకు వెంకటేష్, రేణుక ఉద్యోగాలకు వెళ్లిపోగా సహస్ర ఇంటి వద్దనే ఉంది. బాలిక తండ్రి పాపకు లంచ్ బాక్స్ పంపాలనిమధ్యాహ్నం 12.30 గంటలకు ఆఫీసు నుండి ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వచ్చి చూసే సరికి సహస్ర ఇంట్లోని మంచంపై రక్తపు మడుగులో పడి ఉంది. ఆమె ఒంటిపై కత్తిగాట్లు ఉన్నాయి.
దీంతో మృతురాలు తండ్రి వెంకటేష్ పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మైనర్ బాలికను అత్యంత దారుణంగా హత్య చేసింది ఎవరు.? ఎందుకు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తమపై కక్ష్యతోనే ఈ దారుణానికి పాల్పడ్డారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ మిగతా ఇద్దరు పిల్లలు కూడా ఇంట్లో ఉంటే వారిని కూడా చంపేసేవారేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.