
న్యూఢిల్లీ: ఓట్ చోరీ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. బీజేపీతో కుమ్మక్కై ఈసీ ఓట్ల చోరీకి పాల్పడుతోందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై విమర్శల దాడి చేస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ, ఎన్నికల సంఘం మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఈసీ బీజేపీ బీ టీమ్‌గా మారిందని రాహుల్ ఆరోపిస్తుండగా.. అన్ని పార్టీలు మాకు సమానమేనని.. వ్యక్తులు, పార్టీల పట్ల ఎలాంటి భేదాభిప్రాయాలు లేవంటూ ఈసీ కౌంటర్ ఇస్తోంది.
ఈ క్రమంలో ప్రతిపక్ష ఇండియా కూటమి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఇండియా కూటమి సిద్ధమవుతోన్నట్లు ఆ బ్లాక్ వర్గాలు వెల్లడించాయి. సీఈసీపై అభిశంసన తీర్మానం కోరుతూ నోటీస్ ఇచ్చేందుకు కావాల్సిన సభ్యుల సంతకాల సేకరణ సైతం సోమవారం (ఆగస్ట్ 18) మధ్యాహ్నం నుంచి ప్రారంభించనున్నట్లు సమాచారం.
సీఈసీపై అభిశంసన తీర్మానం కోరడానికి ఇండియా కూటమి ప్రధానంగా రెండు కారణాలు చెబుతోంది. నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఎన్నికల సంఘం అధికార ఎన్డీఏ కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తూ.. బీజేపీ బీ టీంగా పనిచేస్తోందనేది ప్రధాన ఆరోపణ. ఈసీ ప్రతిపక్ష నాయకులను బెదిరిస్తున్నారని, ఒత్తిడి చేస్తున్నారనేది రెండో ఆరోపణ.
సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై ప్రతిపక్షాల అభిశంసన తీర్మానంపై కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం ప్రజాస్వామ్యం యొక్క అన్ని ఆయుధాలను ఉపయోగిస్తామని అన్నారు. ఈ అంశంపై మేం ఇప్పటివరకు ఎటువంటి చర్చలు జరపలేదు.. కానీ అవసరమైతే ఏదైనా చేస్తామని ఆయన పేర్కొన్నారు.