పెళ్లి క్యాన్సిల్‌‌‌‌ చేసేందుకు కిడ్నాప్‌‌‌‌ డ్రామా

పెళ్లి క్యాన్సిల్‌‌‌‌ చేసేందుకు కిడ్నాప్‌‌‌‌ డ్రామా
  •  యువకుడికి కౌన్సిలింగ్  ఇచ్చి పంపించిన ఆర్జీఐఏ పోలీసులు

లండన్ లో జాబ్ చేస్తున్నట్టు తల్లిదండ్రులను నమ్మించిన ఓ యువకుడు తన పెళ్లి క్యాన్సిల్ చేసేందుకు కిడ్నాప్ డ్రామా ఆడి పోలీసులకు దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే..మేడ్చల్ జిల్లాకు చెందిన ఓ యువకుడు లండన్ లో హోటల్ మేనేజ్ మెంట్ పూర్తి చేశాడు. అక్కడ పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ తన పేరెంట్స్ కి డబ్బు పంపించేవాడు. ఆ యువకుడికి తల్లిదండ్రులు పెళ్లిచేయాలనుకున్నారు. ఆగస్టులో లండన్ నుంచి సిటీకి రప్పించారు. ఓ అమ్మాయితో ఆ యువకుడికి ఎంగేజ్ మెంట్ అయ్యింది. తర్వాత మళ్లీ లండన్ వెళ్తున్నట్టు చెప్పిన ఆ యువకుడు చెన్నై ఫ్లైట్ ఎక్కాడు. లండన్ లో ఆ యువకుడికి ఫుల్ టైం జాబ్ దొరక్కపోవడంతో చెన్నైకి వెళ్లాలని ముందగానే ప్లాన్ చేసుకున్నాడు. చెన్నైకి వెళ్లి ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో జాబ్ లో చేరాడు. కానీ తాను లండన్ లోనే ఉంటున్నట్టు తన తల్లిదండ్రులను, ఫ్రెండ్స్ ని నమ్మించాడు.

15 రోజుల్లో పెళ్లి ఉండగా..

ఆ యువకుడు మరో 15 రోజుల్లో పెళ్లి ఉందనగా ఆందోళనకు గురయ్యాడు. పెళ్లయితే తాను చెన్నైలో ఉంటున్న విషయం అందరికీ తెలిసిపోతుందనుకున్నాడు. పెళ్లి క్యాన్సిల్ చేయాలని స్కెచ్ వేశాడు. తాను లండన్ నుంచి వస్తున్నానని తల్లిదండ్రులకు 2 రోజుల క్రితం సమాచారం ఇచ్చాడు. ఫ్లైట్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకి బుధవారం రాత్రి చేరుకుంటుందన్నాడు. కానీ ఆ రోజు రాత్రి ఆ యువకుడు ఇంటికి వెళ్లలేదు. ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులకు గురువారం ఉదయం కుమారుడి నుంచి ఫోన్ వచ్చింది. రాత్రి ఎయిర్ పోర్టు నుంచి ఇంటికి బయలుదేరిన తనను క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేసి..రూ.2లక్షల యూకే కరెన్సీ, బంగారం దోపిడీ చేసి గుర్తు తెలియని ప్రాంతంలో వదిలివెళ్లారని ఫోన్ లో తల్లిదండ్రులకు చెప్పాడు. తల్లిదండ్రులు ఎయిర్ పోర్ట్ పోలీసులను ఆశ్రయించారు. 4 టీమ్స్ తో దర్యాప్తు చేపట్టిన పోలీసులు  ఫ్లైట్ వివరాలతో పాటు ఇమ్మిగ్రేషన్ అధికారుల వద్ద ఉన్న ప్యాసింజర్ల డేటా ను పరిశీలించారు. ఎక్కడా యువకుడి పేరు లేదు. ఎయిర్ పోర్ట్ లోని సీసీ కెమెరాల ఫుటేజ్ ని చూశారు. అందులోనూ  యువకుడు కనిపించకపోవడంతో పోలీసులకు అతడిపై అనుమానం వచ్చింది. 2 రోజుల క్రితం  కాల్ డేటా టవర్ లొకేషన్ ఆధారంగా అతడు ఆ సమయంలో చెన్నైలో ఉన్నట్లు గుర్తించారు. ప్లాన్ ప్రకారమే కిడ్నాప్ డ్రామా ఆడినట్లు పోలీసులు తేల్చారు. ఆ యువకుడికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.