నిజామాబాద్​లో కలకలం రేపుతున్న పిల్లల కిడ్నాప్

 నిజామాబాద్​లో కలకలం రేపుతున్న పిల్లల కిడ్నాప్
  •     నిజామాబాద్​లో వారం వ్యవధిలో నలుగురు పిల్లలను ఎత్తుకెళ్లిన ముఠా
  •     చిన్నారులు దొరకడంతో ఊపిరి పీల్చుకున్న పేరెంట్స్
  •     స్కూల్​ మేనేజ్​మెంట్లను అలర్ట్​ చేస్తున్న పోలీస్​ ఆఫీసర్లు 

నిజామాబాద్, వెలుగు: జిల్లాలో వరుసగా జరుగుతున్న చిన్నపిల్లల కిడ్నాప్ లు కలకలం రేపుతున్నాయి. వారం రోజుల్లో నాలుగు చోట్ల పిల్లలు అపహరణకు గురై దొరికారు. రెండు ఘటనల్లో నిందితులను పోలీసుల అదుపులోకి తీసుకోగా, వీరి వెనుక ఓ ముఠా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వరుస కిడ్నాప్​లు పేరెంట్స్​తో పాటు పోలీస్​ ఆఫీసర్లను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కిడ్నాప్​లను సీరియస్​గా తీసుకున్న సీపీ కల్మేశ్వర్​ స్కూల్స్​ మేనేజ్​మెంట్లను అప్రమత్తం చేశారు. పిల్లలను ఎత్తుకెళ్లడానికి కిడ్నాపర్లు మత్తు చాక్లెట్లు వాడుతున్నట్లు అనుమానిస్తున్నారు. వాటిని తిన్న పిల్లలు మత్తులోకి జారుకోగానే చడీచప్పుడు కాకుండా కిడ్నాప్​ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

వరుస ఘటనలు..

  సిటీ శివారులోని మాలేపల్లి కాలనీలో జనవరి 30న సాయంత్రం ఏడేండ్ల సల్మాన్ ను సోయెల్​ అనే యువకుడు కిడ్నాప్​ చేసి ఆటోనగర్​కు చెందిన ఆబెద్, షబానా దంపతులకు అప్పగించాడు. వారు హైదరాబాద్​లో రూ.3 లక్షలకు బాలుడిని అమ్మారు. సీసీ పుటేజీ సాయంతో రెండు రోజుల్లో కేసును ఛేదించిన పోలీసులు, బాబును కొనుగోలు చేసిన జరీనా, చాంద్​పాషాను అదుపులోకి తీసుకున్నారు. 
 

బడాభీంగల్​కు చెందిన విద్యుత్​ శాఖ లైన్​మన్​ గంగారాం ఈ నెల 4న భార్యతో కలిసి మరో గ్రామానికి వెళ్లేందుకు ఆర్మూర్​ బస్టాండ్​లో బస్సులో సీటు ఆపే ప్రయత్నం చేస్తున్న టైంలో వారి ఐదేండ్ల బాలుడు సిద్ధార్థ తేజ కిడ్నాపయ్యాడు. సత్తెమ్మ అనే మహిళ వరంగల్​ వెళ్లే బస్సులో బాబును తీసుకెళ్లింది. చాక్లెట్​ తిన్న బాలుడు నిద్రమత్తులో నుంచి తేరుకొని పెద్దగా ఏడవడంతో అనుమానించిన ప్యాసింజర్లు సత్తెమ్మను ప్రశ్నించారు. ఆమె చెప్పిన సమాధానాలు అనుమానంగా ఉండడంతో కమ్మర్​పల్లి పోలీస్​ స్టేషన్​కు బస్సును తీసుకెళ్లారు. నిందితురాలు పోలీసుల అదుపులో ఉండగా, కిడ్నాప్​కు గురైన బాలుడు కొన్ని గంటల్లోనే పేరెంట్స్​ వద్దకు చేరుకున్నాడు. 

ఈ నెల 4న సాయంత్రం కంఠేశ్వర్​ కల్లుబట్టీలో రాజు తన భార్యతో కలిసి కల్లు తాగుతూ ఏమరపాటుగా ఉన్న టైంలో వారి రెండేండ్ల కొడుకును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రూరల్​ పోలీసులు గాలింపు ముమ్మరం చేయడంతో భయపడిన కిడ్నాపర్లు బాబును మోర్తాడ్​ మండలంలోని ఓ కెనాల్​ పక్కన మంగళవారం వదిలేసి పరారయ్యారు. స్థానికులు బాబును గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
 
ఈ నెల 1న ఆర్మూర్​ పట్టణంలో శేక్​ మహేరా అనే ఏండేండ్ల మూగ అమ్మాయి కిడ్నాప్​కు గురైంది. కొన్ని గంటల వ్యవధిలో దొరికింది. మూగ బాలిక కావడంతో ఏమి జరిగిందో చెప్పలేకపోతోంది. ఆమెను కూడా కిడ్నాప్​ చేసినట్లు అనుమానిస్తున్నారు.

అలర్ట్​గా ఉండాలి..

జిల్లాలో వరుస కిడ్నాప్​లు​జరుగుతున్న దృష్ట్యా అలర్ట్​గా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. పిల్లల సంఖ్య ఎక్కువగా ఉండే జిల్లాలోని స్కూల్స్​ యాజమాన్యాన్ని సీపీ కల్మేశ్వర్​ అలర్ట్​ చేశారు. వాచ్​మన్​లను నియమించుకోవాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. సీపీ ఆదేశాలతో గవర్నమెంట్​ టీచర్లు,  ప్రైవేటు స్కూల్​ మేనేజ్​మెంట్లు తమ పరిధిలో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇక మాలేపల్లి, ఆర్మూర్​ బస్టాండ్​లో ఘటనల్లో నిందితులు పోలీసుల కస్టడీలో ఉండగా, మరో రెండు కిడ్నాప్​ కేసుల తాలూకు ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు.   

ALSO READ : మానుకోట కాంగ్రెస్​ టికెట్ కోసం పోటాపోటీ