
డిచ్‌పల్లి, వెలుగు: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండల కేంద్రంలో ఇటీవల కలకలం సృష్టించిన ముగ్గురి హత్య కేసును పోలీసులు ఛేదించారు. సీపీ కార్తికేయ వివరాల ప్రకారం.. జిల్లాలోని నవీపేట్‌కు చెందిన గంధం శ్రీకాంత్ అలియాస్ మల్లేశ్(21) పాత నేరస్థుడు. పలు దొంగతనాలు చేసి జువైనల్‌హోంకు వెళ్లి వచ్చాడు. సిటీలోని సాయిబాబా టెంపుల్ వాచ్‌మన్ తల పగలగొట్టి హుండీ దొంగిలించాడు. ఈ కేసులో 3 ఏండ్లు జైలు శిక్ష అనుభవించి 2 నెలల కింద రిలీజ్అయ్యాడు. డబ్బు కోసం ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి డిచ్‌పల్లిలోని హార్వెస్టర్ గ్యారేజీలో ఉన్న పంజాబ్‌కు చెందిన హరపాల్సింగ్, జోగిందర్‌సింగ్, సంగారెడ్డి జిల్లాకు చెందిన సునీల్ పై దాడి చేసి చంపాడు. ఒకేరోజు ముగ్గురు హత్యకు గురవ్వడంతో కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అడిషనల్ సీపీ స్వామి, ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 3స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. పాత నేరస్తుల ఇండ్లల్లో ఆదివారం ఉదయం నుంచి సోదాలు చేయగా సిటీలోని గాజులపేటలో ఉంటున్న శ్రీకాంత్ ఇంట్లో రక్తపు మరకలతో ఉన్న షర్ట్ దొరికింది. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా డబ్బు కోసం తానే ముగ్గురిని సుత్తితో తలపై కొట్టి చంపానని ఒప్పుకున్నాడు.హత్యకి ఉపయోగించిన సుత్తి, డబ్బు, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సీపీ వెల్లడించారు.